జిల్లాలో జగనన్న గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి..
1 min readజిల్లా మేనేజర్ కె రవికుమార్
డిసెంబర్ ఒకటో తేదీ నుండి జనవరి 30వ తేదీ వరకు మెగా కాంప్లెషన్ డ్రైవ్..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతిని వేగవంతం చేయాలని గృహ నిర్మాణ శాఖ జిల్లా మేనేజర్ కె. రవికుమార్ అధికారులను ఆదేశించారు. జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతి తీరుపై తహసీల్దార్లు, ఎంపిడిఓ లు, గృహ నిర్మాణ శాఖ ఇంజినీర్లతో మంగళవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ జగనన్న ఇళ్ల పధకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని , జిల్లాలో జగనన్న ఇళ్ల నిర్మాణాల పనులను వేగవంతం చేసేందుకు డిసెంబర్ , 1వ తేదీ నుండి జనవరి, 30వ తేదీ వరకు 60 రోజులపాటు ప్రత్యేకంగా ‘మెగా కంప్లీషన్ డ్రైవ్ ‘ ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ డ్రైవ్ లో ఇప్పటికే ప్రారంభించిన 21 వేల ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కృషి చేయాలనీ ఆయన ఇంజనీరింగ్ అధికారులకు పిలుపునిచ్చారు. గృహ నిర్మాణ లక్ష్యాలను మండల, గ్రామ, సచివాలయాలు వారీగా నిర్దేశించడం జరిగిందని, గ్రామ/వార్డ్ వార్డ్ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ అమినిటీ సెక్రటరీలు రానున్న రెండు నెలలు జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా ఎంపిడిఓలు, గృహ నిర్మాణ శాఖాధికారులు పర్యవేక్షించాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, ఐరన్ కి ఎటువంటి కొరతా లేదని, ఇళ్ల నిర్మాణపనులలో లబ్దిదారులకు పూర్తి స్థాయి సహకారం అందించి ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ రవికుమార్, డిఆర్ డి ఏ పీడీ విజయరాజు, డ్వామా పీడీ రాము, అరడబ్ల్యూఎస్ ఎస్ ఈ సత్యనారాయణ, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఎస్. వెంకటకృష్ణ, జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపిడిఓ లు, గృహనిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.