శ్రీ భగవద్గీత సహస్ర గల పారాయణ ప్రచార పత్రాల ఆవిష్కరణ
1 min readఆవిష్కరించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగరంలోని సంకల్ బాగ్ లో ఉన్న శ్రీ గీతా ప్రచార ధామం ప్రాంగణంలో డిసెంబర్ 23వ తేదీ స్వామి విద్యాప్రకాశానంద గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ భగవద్గీత సహస్ర గల పారాయణ ప్రచార కరపత్రాలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్, గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణతోపాటు కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. వీరందరినీ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ శాలువా కప్పి అభినందించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు ,శ్రీ గీతా ప్రచార సంఘం చైర్మన్ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గత 37 సంవత్సరాలుగా గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం భగవద్గీత ప్రవచన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 23వ తేదీ భగవద్గీత సహస్ర గల పారాయణ కార్యక్రమాన్ని వెయ్యి మందితో నిర్వహించేందుకు గీతా ప్రచార సంఘం ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎలాంటి చందాలు ఆశించకుండా గీతా ప్రచార సంఘం స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రజలందరూ మంచి మార్గంలో నడుచుకునే విధంగా చేసేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులను, పీఠాధిపతులను పిలిపించి ప్రవచన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.డిసెంబర్ 23వ తేదీ జరిగే గీత సహస్ర గల పారాయణ కార్యక్రమంలో శ్రీ కాళహస్తికు చెందిన పూజ్య శ్రీ సంపూర్ణానంద గిరి స్వామి, తిరుపతి శ్రీనివాస మంగాపురం కు చెందిన స్వరూపానంద గిరి స్వామి, విజయవాడకు చెందిన శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామి, శ్రీ సద్గురు బాను వతమ్మ, కర్నూలు చిన్మయ మిషన్ కు చెందిన సుప్రే మానంద మాతాజీ, శ్రీ లలితా పీఠం పీఠాధిపతి గురు మేడ సుబ్రహ్మణ్యం తో పాటు వివిధ ఆధ్యాత్మిక సంస్థల ప్రముఖులు పాల్గొని అమూల్య సందేశాలతో పాటు ఆశీర్వచనాలను ఇస్తారని తెలిపారు. ఇలాంటి పవిత్రమైన మంచి కార్యక్రమాలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ మాట్లాడుతూ డిసెంబర్ 23వ తేదీ జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మందితో భగవద్గీత సహస్ర గల పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు భగవద్గీత పుస్తకాలతో పాటు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు.