బీసీల హక్కులకై పోరాడుతున్న యోధుడు నక్కలమిట్ట శ్రీనివాస్
1 min readమాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాజ్యాంగపరంగా వెనుకబడిన వర్గాల వారికి కల్పించబడిన హక్కుల పరిరక్షణకై పోరాడుతున్న యోధుడు నక్కల మిట్ట శ్రీనివాసులు అని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో నక్కల మీద శ్రీనివాసులు ఆత్మకథ నా జీవితం- జ్ఞాపకాలు అన్న పుస్తకాన్ని ఆయన ఈరోజు మాజీ ఎంపీ బుట్టా రేణుక తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలగకుండా వాటిని కాపాడుకోవడంలో బీసీలందరినీ ఐకమత్యంతో కలుపుకుని పోరాటం చేస్తున్న వ్యక్తి శ్రీనివాసులు అన్నారు. తాను వైశ్య కులానికి చెందిన వాడిని అయినప్పటికీ వైశ్యులలో వెనుకబడిన వారి అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ తనపైన ఎటువంటి కులముద్ర వేయకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లందరూ తనను ఎంతగానో ఆదరిస్తూ, అభిమానిస్తున్నారని టీజీ వెంకటేష్ తెలిపారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యాంగపరంగా ఎన్నో రకాల హక్కులను సౌకర్యాలను కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ను చత్రపతి శివాజీ వంశీయులు ఉన్నత చదువులు చదవడానికి సహకారాన్ని అందించారని తెలిపారు. ఓసీలందరూ చెడ్డవారు, బీసీలందరూ మంచివారు అని ఎప్పుడూ భావించరాదని మనుషుల ప్రవర్తనను బట్టి, వారి నడవడికను బట్టి మంచివారు, చెడ్డవారు ఉంటారని గమనించాలని టీజీ కోరారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఫలాలు పేదవారికి అందాలంటే ధనవంతులు అయిన వారికి రిజర్వేషన్ వర్తించకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటి బీసీ లీడర్ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడం జరిగిందని, అది నక్కల మిట్ట కృషితోనే జరిగిందని ఈ సందర్భంగా అభినందించారు. రాజ్యాంగం రక్షింపబడాలన్న, దేశం అభివృద్ధి చెందాలన్నా ప్రజల కోసం కష్టపడి సేవా కార్యక్రమాలు చేపట్టే వారికి తమ ఓటును వేసేలా ప్రజలు నిర్ణయించుకోవాలని టీజీ వెంకటేష్ కోరారు. ఈ కార్యక్రమంలో పట్నం రాజేశ్వరి, రిటైర్డ్ డిఎస్పీలు శ్రీధర్, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.