చాగలమర్రిలో.. అంగన్వాడీల బిక్షాటన..
1 min readచాగలమర్రి, పల్లెవెలుగు: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని గత ఏడు రోజుల నుండి నిరవధిక సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఇందుకు నిరసనగా అంగన్వాడీలు బుధవారం దీక్ష శిబిరం నుంచి పురవీధులలో భిక్షాటన చేసి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చంద్రకళ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడి న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని, తెలంగాణ కన్నా అదనంగా వేయి రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన జగనన్న హామీలను విస్మరించి అంగన్వాడీల పై చిన్నచూపు చూస్తున్నారు అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా పీఠం ఎక్కిన ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా స్వేచ్ఛాయుత హక్కులను కాలరాస్తూ దౌర్జన్యాలకు పాల్పడడం సరి కాదన్నారు. తాళాలు పగలగొట్టి దౌర్జన్యంగా అంగన్వాడి కేంద్రాల్లోకి చొరబడి సచివాలయ సిబ్బందితో అంగన్వాడి నిర్వహణ నిర్వహించడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల నాయకురాలు సుజాత ఇందుమతి, గుర్రమ్మ, వివిధ గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడి సహాయకులు పాల్గొన్నారు.