ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను..
1 min readకర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్
ఎమ్మెల్యేగా గెలిపించి పనితీరు చూడాలన్న టి.జి భరత్
ఆదివారం భారీగా టిడిపిలోకి చేరికలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. ఆదివారం నగరంలోని మౌర్య ఇన్‌లో 52వ వార్డు ఎల్.బి.ఎస్ నగర్ వాసులు లక్ష్మీనారాయణ, ఆదినారాయణ బృందం తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, తెలుగుయువత పార్లమెంటు అధ్యక్షుడు అబ్బాస్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నాయకుడు ఎద్దుపెంట అంజి వైసీపీని వీడి తన అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం రోజా, ఇందిరాగాంధీ నగర్‌లకు చెందిన పలువురు యువకులు సురేష్, మధు, వంశీతో పాటు పలువురు మహిళలు.. టిడిపి నేత మన్సూర్ ఆలీఖాన్ ఆధ్వర్యంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. టి.జి భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇక కర్నూల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవడంతో పాటు ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళతానని హామీ ఇచ్చారు. తాను ఇతరుల మాదిరిగా మాటలు చెప్పకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తానన్నారు. ఇతర పార్టీల నాయకులు రాజకీయాల్లోకి వేరే ఆలోచనలతో వచ్చారని.. తాను మాత్రం ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతోనే వస్తున్నట్లు స్పష్టం చేశారు. తన తండ్రి టి.జి వెంకటేష్ అధికారంలో ఉన్నప్పుడు కర్నూలును ఎంతో అభివృద్ధి చేశారని.. తనను గెలిపిస్తే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంకా అభివృద్ధి చేస్తానని వివరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామన్నారు. కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో 52వ వార్డుకు చెందిన లక్ష్మన్న, జగదీష్, వెంకటేశ్వర్లు, గోపి, చిన్న, శీను, డేవిడ్ పాల్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సౌభాగ్యమ్మ, రఫిక్, సద్దాం, జరీనా, రజియా, తదితరులు పాల్గొన్నారు.