స్వామి వివేకానందుని జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం
1 min readజిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : స్వామి వివేకానందుని జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన పేర్కొన్నారు. శుక్రవారం రాజ్ విహార్ సెంటర్ లో జాతీయ యువజన దినోత్సవం మరియు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 12 వ తేదీన స్వామి వివేకానంద జయంతిని జరుపుకుంటామని అన్నారు.ఇదే రోజున వివేకానందునికి యువతతో లోతైన అనుబంధం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం “జాతీయ యువజన దినోత్సవం” గా ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. యువతను సరైన మార్గంలో నడిపించేందుకు వివేకానంద ఎన్నో విజయ రహస్యాలను అందరితోనూ పంచుకున్నారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకుంటారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న దేశం మనదే అని దేశాభివృద్ధిలో యువత పాత్ర చాలా కీలకమని, వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి యువత పాటుపడాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. యువత అందరూ స్వామి వివేకానందుని మార్గంలో పయనించి ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం, ప్రతి ఒక్క వ్యక్తి స్వామి వివేకానందుడిని ఎంతగానో గౌరవిస్తారని దానికి కారణం వివేకానంద భారతదేశం తరుపున అమెరికా వెళ్లి తన యొక్క మాట తీరుతో అక్కడి ప్రజలందరీ చేత శభాష్ అనిపించుకున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు.. మన దేశంలోని ఆధ్యాత్మిక విషయాల గురించి, సనాతన ధర్మం గురించి విశ్వానికి ఎంతో చక్కగా వివారించారని పేర్కొన్నారు.. ఆయన ఆలోచనలు, ఆశయాలను అనుసరించిన వారి యొక్క వ్యక్తిత్వం ఖచ్చితంగా మారుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. వివేకానందుడు యువతకు ప్రేరణనిచ్చే సూక్తులు, స్ఫూర్తివంతమైన సందేశాలను జిల్లా కలెక్టర్ గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో సెట్కూరు సిఈఓ పివి రమణ, రిటైర్డ్ డాక్టర్ మోక్షేశ్వరుడు, నగరంలోని వివిధ విద్యాసంస్థల అధినేతలు,తదితరులు పాల్గొన్నారు.