జీవితం శాశ్వితం కాదు.. సేవలే శాశ్వితం..
1 min readభగవాన్ శ్రీ బాలసాయిబాబా సేవలు..చిరస్మరణీయం..
- పేదలకు కుట్టుమిషన్లు, గ్రౌండర్లు, వికలాంగులకు త్రి చక్ర వాహనాలు పంపిణీ చేయడం అభినందనీయం
- భగవాన్ శ్రీ బాల సాయిబాబా జన్మదిన వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్
కర్నూలు, పల్లెవెలుగు:భగవాన్ శ్రీ బాలసాయిబాబాకు భౌతికంగా మన మధ్య లేకపోయినా… సేవల రూపంలో చిరస్మరణీయంగా నిలిచిపోయారన్నారు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. ప్రపంచంలో ఎవరికి జీవితం శాశ్వితం కాదని… సేవలే శాశ్వితమని పేర్కొన్న ఆయన…బాల సాయిబాబా అందరి మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆదివారం భగవాన్ శ్రీ బాలసాయిబాబా జన్మదిన వేడుకలు, ప్రపంచ శాంతి సదస్సును భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్టు చైర్మన్ టి. రామారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా రాజ్య సభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు నగర మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, మధన్ గోపాల్, విశ్వహిందూ పరిషత్ నాయకులు నంది రెడ్డి సాయి రెడ్డి, గోరంట్ల రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ భగవాన్ శ్రీ బాల సాయిబాబా ఎవరు నుంచి ఏమీ ఆశించకుండా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారని వివరించారు . ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ తో పాటు భగవాన్ శ్రీ బాల సాయిబాబా పుట్టినరోజు వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ రెండు విషయాలను గుర్తుంచుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పరాదని, పొరపాటున కూడా ఇతరులకు హాని తలపెట్టరాదని చెప్పారు. ఈ రెండు ఆచరించేవారు భగవంతుని ప్రార్థించాల్సిన అవసరం లేదని భగవంతుడు అంటే భయం ఉంటే చాలు అన్నారు. భగవాన్ శ్రీ బాల సాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ ను రామారావు చక్కగా నడుపుతున్నారని అభినందించారు. భగవాన్ శ్రీ బాల సాయిబాబా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అంతకు ముందు భగవాన్ శ్రీ బాల సాయిబాబా సమాధిపై పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఆ తరువాత భగవాన్ శ్రీ బాల సాయిబాబా జన్మదిన సందర్భంగా పేదలకు గ్రైండర్లు, కుట్టుమిషన్లు, వికలాంగులకు త్రిచక్ర వాహనాలను అందజేశారు భగవాన్ శ్రీ బాల సాయిబాబా ఆశ్రమం తరపున నగరం మేయర్ బి వై రామయ్య రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ కు శాలువా కప్పి భగవాన్ శ్రీ బాల సాయిబాబా చిత్రపటాన్ని అందజేసి సన్మానించారు.