అక్రమ అరెస్టులు… నిర్బంధాలు తగవు
1 min readఏఐటీయూసీ నంద్యాల జిల్లా అధ్యక్షులు వి రఘురామమూర్తి.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: విజయవాడలో జరుగుతున్న ఆమరణ నిరాహార దీక్షలు భగ్నం చేసేందుకు,ఉద్యమాన్ని నీరుగార్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా కార్మిక సంఘాల నాయకులను అంగన్వాడి కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం తగదని, నిర్బంధాలతో కార్మిక ఉద్యమాన్ని ఆపలేరని ఏఐటియుసి నంద్యాల జిల్లా అధ్యక్షులు వి. రఘురాం మూర్తి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నందికొట్కూరు పట్టణం నందు పటేల్ సెంటర్లో కేజీ రోడ్డు పై ఏఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్మికులకు మద్దతుగా అరెస్టులకు, నిర్బంధాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి నిరసిస్తూ సోమవారం రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం దాదాపు 41 రోజులుగా నిరవధిక సమ్మెను శాంతియుతంగా చేస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వారి సమస్యలను పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సమంజసం కాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులను ప్రభుత్వ అధికారులు , వైసీపీ నాయకులు విధుల్లో చేరాలని బెదిరింపులకు పాల్పడితే సహించబోమన్నారు. శాంతియుతంగా చేస్తున్న నిరవధిక సమ్మె రాష్ట్ర ప్రభుత్వానికి కనపడలేద లేక చూస్తూ గుడ్డిగా నిద్ర పోతుందా అని ప్రశ్నించారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగస్తులంటూ వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేసి,వారినీ నిట్టనిలువునా ముంచిన దుర్మార్గమైన ప్రభుత్వమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిద్రమత్తు వీడి కార్మికులు చేస్తున్న ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకొని వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ప్రభుత్వంపై అంగన్వాడి కార్యకర్తలు ఆదిశక్తి ఉగ్రరూపం దాలిస్తే వైసీపీ ప్రభుత్వం కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తారని హెచ్చరించారు.ఈ నిరసన దీక్షకు సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం. శ్రీనివాసులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు మహానంది, తాలుక నాయకులు దినేష్, వినోద్, ఏఐటియుసి నాయకులు రాముడు, ముత్తు ,జగదీష్ ,ప్రతాప్ ,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.