అవినీతికి పాల్పడుతున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలి పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకం లో జరిగిన అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్యాపిలి నూతన ‘ఎంపీడీవో సాయి మనోహర్ కి వినతిపత్రం గురువారం అందజేశారు .ఈ సందర్భంగా AISF జిల్లా అధ్యక్షులు సూర్య ప్రతాప్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంఎంతో ప్రతిష్టాత్మకంగా పేద విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం లో రాజకీయ నాయకులు పేరు చెప్పుకొని విద్యార్థుల కడుపు కొట్టి, అవినీతికి పాల్పడుతున్నారని వారు అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మెనూ ప్రకారం పేద విద్యార్థు లకు భోజనం అందిస్తుండగా, ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మధ్యాహ్న భోజన నిర్వాహకులకు అనుకూలంగా పనిచేస్తూ వారికి అనుకూలంగా రికార్డులు రాస్తూ వారి ధనార్జనే ధ్యేయంగా ప్రధానోపాధ్యాయులు పనిచేస్తున్నారు. అధికారులకు ఒక రికార్డు, పాఠశాలలో మరో రికార్డును ఉపయోగిస్తున్నారని వారు పేర్కొన్నారు. కనీసం భోజనం అనంతరం తాగడానికి మంచినీటి సౌకర్యం లేక భోజనం సమయంలో విద్యార్థులు బయట నుంచి వాటర్ ప్యాకెట్లు తెచ్చుకొని దాహం తీర్చుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల పాఠశాలలో దాదాపు 60% శాతం మంది విద్యార్థులు ఇంటి వద్ద నుండే క్యారియర్లు తీసుకువస్తున్నప్పటికీ, వారు మాత్రం 80% విద్యార్థులు భోజనం చేసినట్లు రికార్డులు చూపుతున్నారని వారు మండపడ్డారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు రాజకీయ నాయకుల అండదండ వుండటం ద్వారానే మధ్యాహ్న భోజన ఏజెంట్స్ తో కుమ్మక్కై ఈ అవినీతికి పాల్పడుతున్నారని వారు అన్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన కోడిగుడ్లలో కూడా అన్యాయం చేస్తున్నారని వారన్నారు.ప్రభుత్వం నుంచి నిధులు పాఠశాలలకు కేటాయించగా ఆ నిధులను ఉపయోగించుకొని విద్యార్థుల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని, ఆ నిధులను కూడా సొంత లాభాలకు ఉపయోగించుకున్నారని ఆలోచనలు మాకు కలుగుతున్నాయని వారు అన్నారు. కావున వీటి పై సమగ్ర విచారణ జరిపించి, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో AISF జిల్లా సహాయ కార్యదర్శి శివ కేశవులు, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.