కోర్టు వాయిదా కొచ్చి హత్యకు గురైన వీరనారాయణ
1 min readహత్యకు పాల్పడిన ఈరన్న
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో వీరనారాయణ అనే వ్యక్తిపై కోర్టు సమీపంలోనే దాడి జరిగింది. వీరనారాయణ అనే వ్యక్తిపై ఈరన్న అనే వ్యక్తి కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. కోర్టు సమీపంలో జరిగిన ఈ ఘటనతో అక్కడున్నవారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఘటన అనంతరం అక్కడి నుంచి పారిపోయిన ఈరన్న.. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అసలు వివరాల్లోకి వెళ్తే అనంతపురానికి చెందిన ఈరన్న, వీరనారయణ గతంలో స్నేహితులు. ఇద్దరూ కలిసి బెంగళూరులో కలిసి పనిచేస్తూ ఉండేవారు. బెంగళూరులో సంపాందించిన డబ్బుతో.. వ్యాపారం ప్రారంభిద్దామని నిర్ణయించుకున్నారు. ఆ తర్వా త అనంతపురంలో అల్యూమినియం ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే వీరనారాయణ, ఈరన్న వద్ద నుంచి నాలుగు లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడు.అయితే అప్పు తీసుకున్న వీరనారాయణ ఆ డబ్బును తిరిగి చెల్లించలేదు. దీంతో ఈరన్న ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. దీంతో ఈరన్న నుంచి వచ్చే ఒత్తిడి తట్టుకోలేకపోయిన వీరనారాయణ.. అతనికో చెక్ ఇచ్చాడు. అయితే చెక్‌ను తీసుకెళ్లి బ్యాంకులో డబ్బు తెచ్చుకుందామని భావించిన ఈరన్నకు ఊహించని షాక్ తగిలింది. అకౌంట్లో డబ్బులు లేకపోవటంతో చెక్ బౌన్స్ అయ్యింది. దీంతో వీరనారాయణపై చెక్ బౌన్స్ కేసు వేశాడు ఈరన్న. దీనిని మనసులో పెట్టుకున్న వీరనారాయణ.. తన వాహనాన్ని ఎత్తుకెళ్లాడంటూ బెంగళూరులో ఈరన్న మీద కేసు పెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య వైరం మొదలైంది.ఈ క్రమంలోనే బెంగళూరులో కోర్టుకు వచ్చిన ఈరన్నపై గతంలో వీరనారాయణ దాడి చేశాడు. ఈ ఘటనలో ఈరన్నకు గాయాలయ్యాయి. ఆ ఘటనతో మరింత పగ పెంచుకున్న ఈరన్న.. ప్రతీకారంతో అదే తరహాలో శుక్రవారం ఎమ్మిగనూరు కోర్టుకు వస్తున్న వీరనారాయణపై కత్తితో దాడి చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎమ్మిగనూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొత్తంగా కలిసి వ్యాపారం ప్రారంభించిన ఇద్దరూ.. ఆర్థిక లావాదేవీలలో వచ్చిన విభేదాలతో ఇలా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకూ వెళ్లారు.