భద్రత నియమాలు పాటించడం ద్వారా చాలా ప్రమాదాలను నివారించవచ్చు..
1 min readమోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కెవిఎస్.ప్రసాద్
రోడ్డు భద్రత మాసోత్సవాలో పాల్గొన్న విద్యార్థులు, బస్సు డ్రైవర్లు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: రోడ్డు ప్రమాదాలు అపారమైన ప్రాణ, ధన నష్టాన్ని కలిగిస్తున్నాయని, రహదారిని ఉపయోగించే మనమంతా భద్రత నియమాలు పాటించడం ద్వారా చాలా ప్రమాదాలను నివారించవచ్చునని మోటార్ వెహికల్స్ ఇన్స్పిక్టర్ కెవిఎస్.ప్రసాద్ అన్నారు.జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఉప రవాణా కమిషనర్ ఎస్.శాంతకుమారి అధ్వర్యంలో సోమవారం వట్లూరు సర్ సి.ఆర్.రెడ్డి మహిళా కళాశాల నందు రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జీబ్రా గుర్తు వున్నచోట మాత్రమే రోడ్డు దాటాలని, ఫుట్ పాత్ లేని చోట్ల రోడుకు కుడి వైపున నడవాలన్నారు. వాహనాలు నడుస్తున్నపుడు ట్రాఫిక్ ఐలెండ్ (రోడ్డు మధ్యలో వుండే కట్ట) నుంచి బయటకు అడుగు పెట్టడం చాలా ప్రమాదమని, కనపడని రోడ్డు మలుపులు దగ్గర దాటేప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతిఒక్కరు హెల్మెట్, సీటుబెల్ట్ ఉపయోగించడం తప్పనిసరి అన్నారు. అలాగే వాహనదారులు మలుపు తిరిగేటప్పుడు సిగ్నల్స్ ఇవ్వాలని, వన్ వెలో వాహనము నడపరాదని తదితర విషయాలు వివరించారు. కార్యక్రమములో మోటార్ వెహికల్స్ ఇన్స్పిక్టర్లు కెవిఎస్.ప్రసాద్, జి.ప్రసాదరావు, కళాశాల ప్రిన్సిపల్ పి.శైలజ, సిబ్బంది మరియు కళాశాల బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.