కొలిచేవారికి కొంగు బంగారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి..
1 min readనేటి నుంచి 24వరకు కొణిదెల గ్రామంలో స్వామివారి ఉత్సవాలు.
22 న శుక్రవారం సాయంత్రం రథోత్సవం..
పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు..
చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా తరలిరానున్న భక్తులు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంలో వెలిసిన శ్రీశ్రీ శ్రీ మత్కోణిదేల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు ఆరాధిస్తారు. ప్రతి ఏడాది పాల్గుణ మాస శుద్ధ దశమి సందర్భంగా గ్రామంలో ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచి, ప్రజల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.స్వామి ఉత్సవాల సందర్భంగా చుట్టుపక్కల గ్రామాలు నాగటూరు, మల్యాల, నందికొట్కూరు, మద్దిగట్ల ,నెహ్రు నగర్, ముచ్చు మర్రి, పగిడ్యాల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు .ఈ నెల 19 న స్వామి వారి కళ్యాణం తో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమై 24 న వసంతోత్సవం తో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా గ్రామంలోని స్వామి వారి ఆలయాన్ని అంత్యంత సుందరంగా విద్యుత్ దీపాల అలంకరణతో ముస్తాబు చేశారు.
22న శుక్రవారం రథోత్సవం..
నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామంలో వెలసిన శ్రీ మత్కోణిదేల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి తిరుణాల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్లరథోత్సవం కార్యక్రమం 22 న శుక్రవారం నిర్వహిస్తున్నామని గ్రామ సర్పంచ్ కొంగర నవీన్, కార్యనిర్వహణాధికారి యం. కార్తీక్ ,ఆలయ ధర్మకర్త కిరణ్ కుమార్ , కమిటీ సభ్యులు తెలిపారు. వారు విలేకరులతో మాట్లాడుతూ స్వస్తిశ్రీ శుభకృత్ నామ సంవత్సర పాల్గుణ మాస శుద్ధ దశమి 19 నుంచి 24 వరకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 19 న మంగళవారం స్వామి వారి కళ్యాణం, 20 న బుధవారం ఏనుగు సేవ, 21న గురువారం ప్రభోత్సవం, 22 న శుక్రవారం స్వామి వారి రథోత్సవం, 23న సోమవారం పారువేట ,24 న మంగళవారం వసంతోత్సవముతో ఉత్సవాలు ముగుస్తాయి.గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల ప్రజలు విచ్చేసి స్వామి వారి సేవలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు.
వివిధ రకాల పోటీలు..బల ప్రదర్శనలు..
తిరుణాల సందర్భంగా గుండు పందెం, పొట్టేళ్ల పందెం,పాల పండ్ల ఎద్దుల బండ పందెం, పెద్ద బండ ఎద్దుల పందెం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.తిరుణాలకు వచ్చే భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బండలాగుడు పోటీలలో పాల్గొను ఎద్దుల యజమానులు 9492570227, 8790002654, 9704042508, ఈ ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.బండ పందెమునకు వచ్చిన వారికి శ్రీ సత్యన్నారాయణ స్వామి గుడి దగ్గర గ్రామ రైతు సంఘం మరియు గ్రామ ప్రజల సహకారంతో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చేపల మహేష్ అన్నారు .
ఎద్దులు బండలాగుడు పోటీలు ప్రత్యేక ఆకర్షణ
స్వామి వారి రథోత్సవం సందర్భంగా శుక్రవారం పాలపండ్ల ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నారు.మొదటి బహుమతి రూ.60 వేలు, రెండవ బహుమతి రూ.40 వేలు, మూడవ బహుమతి రూ.30 వేలు, నాలుగో బహుమతి రూ.20 వేలు, ఐదవ బహుమతి రూ.10 వేలు, ఆరవ బహుమతి రూ.5వేలు ప్రకటించారు.
23 న అంతర్రాష్ట్ర స్థాయి ఎద్దులు బండలాగుడు పోటీలు.
శ్రీ మత్కోణిదేల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి తిరుణాల ఉత్సవాలను పురస్కరించుకుని 23న పారువేట సందర్భంగా ఉదయం 7 గంటలకు రైతు సంఘం ఆధ్వర్యంలో ఎద్దులు పెద్దబండ లాగుడు పోటీలు నిర్వహిస్తున్నామని గ్రామ సర్పంచి కొంగర నవీన్, ఆలయ ధర్మకర్త కిరణ్ కుమార్, గ్రామ రైతు సంఘం నాయకులు తెలిపారు. పోటీలలో గెలుపొందిన వృషబాలకు మొదటి బహుమతి రూ.70 వేలు, రెండవ బహుమతి రూ. 50వేలు, మూడవ బహుమతి రూ. 30వేలు, నాలుగో బహుమతి రూ. 20,వేలు, ఐదవ బహుమతి రూ. 10,వేలు, ఆరవ బహుమతి రూ.5,000 అందజేయడం జరుగుతుందన్నారు. గురువారం ప్రభోత్సవము సందర్భంగా చిన్న బండ ఎద్దుల బండ పందెం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రాత్రి గుండుఎత్తు పందెం ఉంటుంది. పోటేళ్ల పందెం ఉంటుందని తెలిపారు.సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
తొమ్మిదేళ్లుగా జాతరలో ఉచిత నీటి సరఫరా…
కొణిదేల తిరుణాల సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఎద్దుల బండలాగుడు పోటీలను పురస్కరించుకుని తిలకించడానికి వచ్చు ప్రజానీకానికి ఉచిత మంచినీటి సౌకర్యం కలిపిస్తున్నారు గ్రామానికి చెందిన సాలే పెద్ద బాలన్న. ఎద్దుల బండలాగుడు పోటీలు ముగిసే వరకు మంచినీటిని అందిస్తున్నారు. దాదాపు గా ఎనిమిదేళ్లుగా జాతరకు వచ్చు భక్తులకు దప్పిక తీర్చుతూ ప్రజల మన్ననలు పొందారు.సమావేశంలో ఉప సర్పంచి భాస్కర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు విజయ లక్ష్మి, నాగలక్ష్మమ్మ, కురువ వేణుగోపాల్, చిన్న పుల్లయ్య, రామేశ్వరమ్మ, కళావతమ్మ, గ్రామస్తులు పెద్ద బాలన్న, రంగస్వామి, కొణిదేల బెస్త రాజు, గోపాల్ ,రాజేశ్వరరావు,కొంగర మూర్తి, మల్లెపోగు చిట్టెన్న,రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.