శ్రీశైలం పాదయాత్ర భక్తులకు హనుమాన్ కళాసమితి చేయూత
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నాటక నుంచి శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు కర్నూలు నగరంలోని హనుమాన్ కళా సమితి తన వంతు అండగా నిలిచింది. పాదయాత్ర చేస్తూ.. ఉగాది నాటికి శ్రీశైలం చేరుకునే విధంగా తరలివెళ్తున్న వందలాది భక్తులకు మందులు, పండ్లు, మజ్జిగ.. పులిహోర ప్రసాదాలను అందజేశారు. కర్నూలు నగరంలోని కొత్త బస్టాండు మీదుగా శ్రీ శైలం వెళుతున్న భక్తులకు హనుమాన్ కళా సమితి అధ్యక్షులు పి హనుమంతరావు చౌదరి, కోశాధికారి లక్ష్మీ పద్మా చౌదరి, దంపతులు సేవలు అందించారు. భ్రమరాంబ దేవిని తమ ఆడపడుచుగా భావించే కర్ణాటక భక్తులు ఉగాది పర్వదినోత్సవ సందర్భంగా శ్రీ భ్రమరాంబా దేవికి చీర.. సారె సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు తమ సొంతూరు నుంచి నెల రోజుల ముందుగానే పాదయాత్ర చేస్తూ బయలుదేరతారు. పసుపు ,కుంకుమ ఒడి బియ్యం తీసుకొని కాలినడకన వెళ్లి తమను.. తమ కుటుంబాలను ఆశీర్వదించమని దేవదేవతలను వేడుకుంటారు. ఎండలు లెక్క చేయకుండా.. ఒట్టి కాళ్లతో పాదయాత్ర చేస్తున్న భక్తులకు తమ వంతుగా చేయూతనిచ్చి ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని హనుమంతరావు చౌదరి అన్నారు. ఇతరులకు సేవ చేయడం అంటే.. దేవుడికి సేవ చేసినట్లేనని.. కన్నడ భక్తులకు సేవ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నాన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ అసోసియేషన్ సెక్రటరీ కట్టా శేఖరు, ఉమామహేశ్వర్ ,శివుడు,రంగ, అరటి పండ్ల రఘు తదితరులు తమ వంతుగా సేవలందించి భక్తులకు సహాయ సహకారాలు అందించారు.