సీఐ ఆదినారాయణరెడ్డిని సస్పెండ్ చేయండి..
1 min readమా క్యాడర్ ని ఇబ్బంది పెడితే వదిలేది లేదు..
- టిడిపి కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టి.జి భరత్
- టిడిపి కార్పోరేటర్, సీనియర్ నాయకులపై దాడి విషయమై ఎస్పీకి ఫిర్యాదు
- .ఏ తప్పు చేయకపోయినా కొట్టాలని రాజ్యాంగం చెబుతోందా.. అని ఘాటుగా ప్రశ్నించిన టీజీ భరత్
కర్నూలు, పల్లెవెలుగు: తమ పార్టీ నేతలను కొట్టిన సీఐ ఆదినారాయణ రెడ్డి, ఇందులో భాగమైన కానిస్టేబుళ్లు మురళి, సాదిక్‌లపై వెంటనే చర్యలు తీసుకోవాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి టి.జి భరత్ డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జనసేన అసెంబ్లీ ఇంచార్జి అర్షద్, బాదితులతో కలిసి జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ చేసి పీస్ మీటింగ్‌కు రావాలంటూ 8వ వార్డు టిడిపి కార్పోరేటర్ పరమేష్‌తో పాటు సీనియర్ నాయకులు శేషగిరిశెట్టి, శ్రీకాంత్‌లను పిలిపించారన్నారు. అక్కడి నుండి జగన్నాధగట్టుపై ఉన్న డి.టి.సికి తీసుకెళ్లి బూతులు మాట్లాడుతూ ఇష్టానుసారంగా కొట్టారని టి.జి భరత్ తెలిపారు. వీరిపై ఎలాంటి కేసులు లేవన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో మద్దతు పెరుగుతుందన్న ఉద్దేశంతోనే కావాలని టార్గెట్ చేసి వీరిని కొట్టారని చెప్పారు. ఏ తప్పు చెయ్యని వాళ్లను కొట్టాలని రాజ్యాంగంలో రాసి ఉందా అని టి.జి భరత్ ప్రశ్నించారు. ఇందుకు కారణమైన సీఐ ఆదినారాయణరెడ్డిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేసినట్లు తెలిపారు. వీరిపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరామన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం జరగని పక్షంలో ఎలక్షన్ కమిషన్‌తో పాటు హైకోర్టును ఆశ్రయిస్తామని టి.జి భరత్ పేర్కొన్నారు. విచారించి ఏం చేయాలన్న దానిపై ముందుకు వెళతామని ఎస్పీ చెప్పారన్నారు.
వైసీపీ ప్రోత్సాహంతోనే… దాడి :
కాగా వైసీపీ నేతల ప్రోత్సాహంతో ఈ దాడులకు పాల్పడినట్లు స్పష్టంగా తమకు అర్థమవుతోందన్నారు. తమ టి.జి కుటుంబం ప్రజాసేవ చేస్తూ ఎవ్వరికీ హాని తలపెట్టకుండా రాజకీయాల్లో కొనసాగుతోందన్నారు. తమ జోలికొస్తే ఎవ్వరినీ వదలబోమన్నారు. ప్రజాసేవ చేస్తున్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తో ఊరుకోమని చెప్పారు. అనంతరం జనసేన ఇంచార్జి అర్షద్ మాట్లాడుతూ టిడిపి నేతలపై దాడి జరిగిన రోజును కర్నూలు నియోజకవర్గ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. టిడిపి మంచి మెజార్టీతో గెలుస్తుందన్న ఉద్దేశంతో క్యాడర్‌ను దెబ్బతీయాలని ఇలా చేస్తున్నారన్నారు. తన కార్యకర్తలపై పడిన దెబ్బలను తనమీద పడినట్లు భవిస్తానని టి.జి భరత్ చెప్పారని అర్షద్ పేర్కొన్నారు. అనంతరం కార్పోరేటర్ పరమేష్, శేషగిరిశెట్టి మాట్లాడుతూ తమపై ఎలాంటి కేసులు లేవని బ్రతిమాలినా వినకుండా కొట్టారని చెప్పారు. ప్రజాప్రతినిధులమైన తమనే కొడితే ఇక ప్రజలను ఎవరు కాపాడతారన్నారు. టిడిపిలో చురుకుగా పనిచేస్తున్నందుకే తమను టార్గెట్ చేసి కొట్టారన్నారు. బాద్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.