PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏప్రిల్ 18వ తేది నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం

1 min read

ఏప్రిల్ 18వ తేది నుండి 25వ తేది వరకు నామినేషన్ల స్వీకరణ

ఏప్రిల్ 29వ తేది నామినేషన్ల ఉపసంహరణ

జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన

పల్లెవెలుగు వెబ్   కర్నూలు : ఏప్రిల్ 18వ తేది నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని, నామినేషన్ల ప్రక్రియలో ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా  పాటించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని సమాచార శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ను  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రారంభించారు.. అనంతరం  నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల సంసిద్ధత పై  కలెక్టర్  మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 18వ తేదిన సార్వత్రిక ఎన్నికలు-2024కు సంబంధించి కర్నూలు పార్లమెంటు, కర్నూలు పార్లమెంటు లో ఉండే  7 అసెంబ్లీ స్థానాలు, నంద్యాల పార్లమెంటులో భాగంగా ఉండే  పాణ్యం నియోజకవర్గానికి కూడా నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందన్నారు. 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన 8 మంది రిటర్నింగ్ అధికారులతో పాటు కర్నూలు పార్లమెంట్ కి సంబంధించి రిటర్నింగ్ అధికారిగా ఉండే తనతో సహా  ఏప్రిల్ 18వ తేది ఉదయం 11 గంటల నుండి నామినేషన్లు తీసుకొనుటకు సిద్ధంగా ఉంటామన్నారు. ఏప్రిల్ 18వ తేది నుంచి ఏప్రిల్ 25వ తేది వరకు ఉ.11గం.ల నుండి మ.3గం.ల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. నామినేషన్లు ఆదివారం, ప్రభుత్వ సెలవు రోజుల్లో స్వీకరించే అవకాశం ఉండదన్నారు..  నామినేషన్లు వేసే వారు మధ్యాహ్నం 3 గంటల లోపు రావాలని,  3 గంటల తర్వాత క్యూ లైన్ లో ఉండే వారికి టోకెన్స్ ఇచ్చి వారి నుండి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వస్తే నామినేషన్లు స్వీకరించడం జరగదన్నారు. ఏప్రిల్ 25వ తేది నాటికి జిల్లాకు కేటాయించిన జనరల్ అబ్జర్వర్లు వస్తారని, ఏప్రిల్ 25 వ తేది నాటికి నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏప్రిల్ 26 వ తేదిన అబ్జర్వర్ల ఆధ్వర్యంలో సంబంధిత రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్క్రూటినీ చేయడం జరుగుతుందన్నారు. నామినేషన్ ఉపసంహరణ చేసుకోవాలంటే ఏప్రిల్ 29తేది వరకు సమయం ఉందన్నారు. నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినప్పటి నుండి ప్రింటింగ్ చేయించడం, పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయించడం, ఈవీఎంలు కమిషనింగ్ చేసుకోవడం, పిఓ, ఏపిఓ లకు మరొకసారి శిక్షణ తరగతులను నిర్వహించుకోవడం లాంటి కార్యక్రమాలను ప్రణాళిక రూపొందించుకోవడం జరిగిందన్నారు.ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆన్లైన్లోనూ నామినేషన్లు సమర్పించే వెసులుబాటును ఎన్నికల కమిషన్ సువిధ పోర్టల్లో కల్పించిందని, ఆన్లైన్లో నామినేషన్లు సమర్పించినప్పటికీ సంబంధిత పత్రాలను ఫిజికల్ గా సంబంధిత నియోజకవర్గ ఆర్వోలకు చివరి నామినేషన్ తేది నాటికి అందజేయాల్సి ఉంటుందని, సమర్పించని యెడల నామినేషన్ గా పరిగణించబడదని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ శాతాన్ని  గతంలో కంటే ఎక్కువగా తీసుకొని వచ్చేందుకు స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా గత ఎన్నికల్లో  కర్నూలు, ఆదోని నియోజకవర్గాలలో  పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదయిందని అందుకుగాను ఈ నియోజకవర్గాల మీద  ప్రత్యేక దృష్టి సారించి ఏ పోలింగ్ కేంద్రంలో తక్కువ శాతం పోలింగ్ నమోదయిందో సంబంధిత పరిసరాలలో ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అంతే కాకుండా  వీడియో, నాటకాలు, పాటల రూపంలో స్వీప్ యాక్టివిటీ కార్యక్రమాలు నిర్వహించి కర్నూలు జిల్లాలో   పోలింగ్ శాతాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.  సివిజిల్ లో ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించడంలో గతంలో జిల్లా యావరేజ్ 64 శాతం  ఉండేదని, ఇప్పుడు 89 శాతానికి పురోగతి తీసుకొని రావడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు..ఎన్నికల నియమావళి ప్రవర్తనకు వ్యతిరేకంగా ప్రవర్తించిన 40 మంది  వాలంటీర్లను తొలగించామన్నారు. 294 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లాకు 2 ఇంటర్ స్టేట్ బార్డర్లు ఉన్నందున క్యాష్, లిక్కర్ మూమెంట్ ఎక్కువగా ఉంటుందనే భావనతో జిల్లాలో ఉన్న  2, 204 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గారి దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందన్నారు.. ఎన్నికల కమిషన్ నుండి ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలనే అంశంపై స్పష్టత  వచ్చిన వెంటనే ఆ మేరకు   వెబ్ కాస్టింగ్  ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయని పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను, వీడియో గ్రాఫర్లను, పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పోలింగ్ కేంద్రాల్లో  ఓటర్లకు త్రాగునీరు, షెడ్, పిడబ్ల్యుడి ఓటర్లకు వీల్ చైర్లు ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల పోలింగ్ విధులకు కేటాయించిన సిబ్బందిలో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, విధులు నిర్వహించలేమని మొదటి విడత లో 400 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 190 మంది కేసులు జెన్యూన్ గా  ఉన్నందున వారికి మినహాయించడం జరిగిందని,  అదే విధంగా  నిన్న కూడా 800 మంది దరఖాస్తు చేసుకున్నారని వారికి వైద్య పరీక్షలు నిర్వహించి జెన్యూన్ గా ఉంటే తప్పకుండా మినహాయించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు జయమ్మ, జిల్లా బిసి సంక్షేమ అధికారి మరియు మీడియా నోడల్ అధికారి వెంకటలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author