PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ బోరు నుంచి వైసీపీ నాయకుల నీటి దోపిడీ..!

1 min read

ప్రభుత్వ బోరు నుంచి ట్యాంకుల ద్వారా అక్రమ రవాణా.

అక్రమంగా నీటి వ్యాపారం సాగిస్తున్నట్లు కాలనీ వాసుల ఆరోపణ.

కాలనీలో తీవ్రమైన నీటి ఎద్దడి..

అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు మున్సిపాలిటీ లోని ఐదవ వార్డు లో  మంచినీటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటు చేసిన బోరు నుంచి వైసీపీ నాయకులు నీటి దోపిడీకి పాల్పడుతూ అక్రమంగా నీటి వ్యాపారం సాగిస్తున్నారని కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని ఆత్మకూరు రోడ్డు  ఐదవ వార్డు కు చెందిన వైసీపీ నాయకుడు బంధువు బోలోర వాహనంలో  వెయ్యి లీటర్ల సామర్థ్యం గల సింటెక్ ట్యాంక్ ద్వారా అక్రమంగా నీటిని తరలిస్తున్నట్లు సమాచారం. ప్రతి రోజు దాదాపు 10నుంచి 20 ట్యాంకు లు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నీటిని ఇతర కాలనీలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తతంగం గురువారం మీడియా ప్రతినిధులకు తెలియడంతో  వైసీపీ నాయకుల బంధువులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. అక్కడే ఉన్న కొందరు మహిళలు వారిపై ఆగ్రహం చెందారు. అధికారులు విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం గురించి  మున్సిపల్ డీఈ నబి రసూల్  కు  పత్రిక విలేకరులు తెలుపగా ఆ విషయం తమ దృష్టికి రాలేదని కాలనీ వాసులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం కొద్ది సేపటి తరువాత మున్సిపల్ సిబ్బందిని అక్కడికి పంపించి అక్కడి విద్యుత్ మీటర్ ఫీజులను తీసుకెళ్లారు.దీనితో నీటి సరఫరా నిలిచిపోయింది. వైసీపీ నాయకుల చర్యలకు కాలనీలో నీటి సమస్య తలెత్తుతున్నాయి.

About Author