కర్నూలు ప్రజల భవిష్యత్తు కోసం.. నన్ను గెలిపించండి..
1 min readటిడిపి కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టి.జి భరత్
- 4వ విడత టి.జి భరత్ సైకిల్ భరోసా యాత్ర
- నగరవీధుల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకున్న టి.జి భరత్
- కర్నూలును సర్వనాశనం చేశారని మండిపాటు
- టి.జి భరత్‌తో పాటు సైకిల్ తొక్కిన కుమారుడు టి.జి విభు
కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు ప్రజల మంచి భవిష్యత్తు కోసం తనను ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. నగరంలోని ఎస్.ఏ.పీ క్యాంపు వద్ద నుండి ఆయన 4వ విడత టి.జి భరత్ సైకిల్ భరోసా యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో టి.జి భరత్‌తో పాటు ఆయన కుమారుడు టి.జి విభు కూడా పాల్గొన్నారు. తండ్రి టి.జి భరత్‌తో పాటు నగరం మొత్తం సైకిల్ తొక్కి విభు ఆకర్షణగా నిలిచారు. యాత్రలో భాగంగా టి.జి భరత్ నగర వీధుల్లో తిరుగుతూ ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో నగరం సర్వనాశనమైందని మండిపడ్డారు. ఏ వీధికి వెళ్లినా ప్రజలు సమస్యలే చెబుతున్నారన్నారు. తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే కర్నూలు రూపురేఖలు మారుస్తానని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తానన్నారు. పంప్ హౌస్ గూడెం కొట్టాల ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగించడం బాధాకరమని భరత్ అన్నారు. వైసీపీ పాలన ఇలాగే కొనసాగితే కరెంటే ఉండదని ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ష్యూరిటీ ఇచ్చారన్నారు. కర్నూల్లో తనను గెలిపిస్తే చంద్రబాబు తీసుకొచ్చిన పథకాలు ప్రజలకు అందించేలా కృషి చేస్తానని భరత్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరి దీవెనలతో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుందన్నారు. కర్నూలు ప్రజలు కూడా ప్రజాసేవ చేసే తమను ఆదరించాలన్నారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబునాయుడు పార్టీలో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు టి.జి భరత్ తెలిపారు.
కర్నూలు కోసమే 6 గ్యారెంటీలు:
పదేళ్లుగా కర్నూల్లోని వార్డుల్లో తిరిగి 6 గ్యారెంటీలు తీసుకొచ్చినట్లు భరత్ చెప్పారు. వార్డుల్లో సమస్యలన్నీ తీర్చి నగరాన్ని నిజమైన స్మార్ట్ సిటీ చేస్తానన్నారు. కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. మహిళలందరికీ అండగా ఉండి వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కృషి చేస్తానని టి.జి భరత్ చెప్పారు. తమ ప్రభుత్వంలో అమలుచేయబోయే సంక్షేమ పథకాలు అర్హులకు అందజేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ప్రభుత్వాసుపత్రిలో సమస్యలు పరిష్కరించి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని చెప్పారు. తాను గెలిచి తమ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలల నుండి సంవత్సరంలోపు కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ముస్లిం సోదరులు కులం, మతం చూడకుండా ప్రజలకు మంచి చేసే తనను గెలిపించాలని ఆయన కోరారు. 40 ఏళ్లుగా కర్నూలు ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు. అధికారంలో ఉంటే ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు మెచ్చేలా పరిపాలన సాగిస్తానని ఆయన తెలిపారు.
భరోసా యాత్రకు… విశేష స్పందన…:
టి.జి భరత్ చేపట్టిన సైకిల్ భరోసా యాత్ర ఎస్.ఏ.పీ క్యాంప్, కొత్త బస్టాండ్, ఇందిరాగాంధీ నగర్ ఆర్చి, సీతారాం నగర్ ఆటో స్టాండ్ నుండి ప్రధాన వీధులతో పాటు, పంప్ హౌస్ పాలకొట్టాలు, అశోక్ నగర్, నరసింహారెడ్డి నగర్, ఆర్.ఎస్ రోడ్డు సర్కిల్, బంగారుపేట మీదుగా మౌర్య ఇన్ చేరుకుంది. ఈ సైకిల్ యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జి అర్షద్, టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, కార్పొరేటర్ పరమేష్, టిడిపి మైనారిటీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మన్సూర్ ఆలీఖాన్, వీరశైవ లింగాయత్ రాష్ట్ర నాయకులు శివరాజ్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు ఇంచార్జీలు, బూత్ ఇంచార్జీలు, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.