నామినేషన్ దాఖలు వేసిన SUCI(C) పార్టీ అభ్యర్థులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రజాస్వామ్యం పేరుతో నేడు మన దేశంలో జరుగుతున్న ఎన్నికలు ఎలా తయారయ్యాయో మనం చూస్తున్నాం. ధన బలం, అధికార బలం, కండబలం, మీడియా బలం ఉన్న పార్టీలదే పైచేయి అయి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ చతురంగ బలాలను పెట్టుబడిదారీ వర్గం, కార్పొరేట్ కంపెనీలు తెరవెనుక నుండి బూర్జువా పార్టీలకు సమకూర్చి పెడుతున్నాయి. ఎన్నికల బాండ్ల కుంభకోణం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అధికారంలోని బిజెపితో పాటు పాలక బూర్జువా పార్టీలు ఏ విధంగా కేంద్ర సంస్థలను ఉపయోగించుకుని పెట్టుబడిదారి దోపిడీ సంస్థలతో కుమ్మక్కై వేలకోట్ల రూపాయలతో ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఎలా ప్రయత్నిస్తున్నాయో స్పష్టమైంది. అలా ఒక బూర్జువా పార్టీ లేదా కూటమికి మద్దతునిచ్చి అధికారంలోకి తెస్తాయి. మన దేశంలో మొదటి సాధారణ ఎన్నికలప్పటినుండి నేటి 18వ దఫా ఎన్నికల వరకు జరుగుతున్న తతంగం ఇదే. ఎన్నికలలో ఒక ప్రభుత్వాన్ని పార్టీని లేదా నాయకున్ని తొలగించి మరొక ప్రభుత్వాన్ని, పార్టీని లేదా నాయకున్ని తెచ్చినప్పటికీ పెట్టుబడిదారీ దోపిడీ, పీడనలు అంతం కావు. ప్రజల కష్టాలు తీరవు. అందుకే వారి జీవితాలలో ఏ మౌలిక మార్పు లేదు. కాలం గడిచే కొద్ది సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే సమాజంలో సమూలమైన మార్పు కొరకు ప్రజాతంత్ర ప్రజా ఉద్యమ నిర్మాణం మాత్రమే నిజమైన ప్రత్యామ్నాయ మార్గమని భావించి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎస్ యు సి ఐ (సి)పార్టీ అభ్యర్థులను ప్రజలు బలపరచాలని విజ్ఞప్తి చేశారు… దేశ వ్యాప్తంగా ఎస్.యు.సి.ఐ (సి) పార్టీ అభ్యర్థులు 19 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో 151 లోక్ సభ స్థానాలకు పార్టీ పోటీ చేస్తోందని తెలియజేశారు.సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) – SUCI(C) పార్టీ ఎన్నికల అభ్యర్థులైన కర్నూలు శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి వి. హరీష్ కుమార్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఎం. నాగన్న, కర్నూలు మున్సిపల్ ఆఫీసు మరియు కలెక్టర్ ఆఫీసులో ఈరోజు నామీనేషన్ వేశారు. అంతకు ముందుగా నగరంలో రాజ్ విహార్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఎస్.యు.సి.ఐ.(సి) పార్టీ రాష్ట్ర నాయకులు ప్రమీల, బసవరాజు సభ్యులు ఖాదర్, విశ్వనాథ్, శ్రీమన్నారాయణ, మల్లేష్, రోజా, శక్రప్ప, ప్రియాంక, రేణుక, వెంకటేష్, సుజాత తదితరులు అభ్యర్థుల వెంట వెళ్ళి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.