పిల్లలు పుట్టకపోతే తప్పంతా ఆడవారిదేనా?
1 min readమగవాళ్లలోనూ సమానంగా సంతానరాహిత్య సమస్యలు
అయినా ఇప్పటికీ భార్యపైనే నింద మోపుతున్న పురుషులు
చదువుకున్నవారు, నగరవాసుల్లోనే ఈ పోకడ ఎక్కువ
కామినేని ఆస్పత్రి సంతానసాఫల్య నిపుణురాలు డాక్టర్ హేమలత
April 21-27, 2024, is National Infertility Awareness Week (NIAW)!
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : పిల్లలు పుట్టడం అనేది గొప్ప వరం. సాధారణంగా అది సహజంగానే జరిగిపోయే ప్రక్రియ. కానీ మారుతున్న జీవనశైలి కారణంగా కొంతమందికి పిల్లలు పుట్టడం లేదు. ఎలాంటి గర్భనిరోధక సాధనాలు వాడకుండా ఉన్నా 12 నెలల్లోపు గర్భం దాల్చకపోతే అది సంతానరాహిత్యం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచిస్తోంది. భారతదేశంలో ఇలా సంతానరాహిత్యంతో బాధపడేవారు మొత్తం జనాభాలో 3.9% నుంచి 16.8% వరకు ఉంటారని చెబుతోంది. ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మాత్రం ఇది 10% నుంచి 15% వరకు ఉంటుందని తేల్చింది. పిల్లలు పుట్టకపోవడానికి చాలా కారణాలు ఉంటాయని కామినేని ఆస్పత్రి సంతానసాఫల్య నిపుణురాలు డాక్టర్ హేమలత తెలిపారు. ఈ సమస్య గురించి, ఈ విషయంలో భార్యాభర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె వివరించారు. “భార్యాభర్తలు ఇద్దరిలో ఏ ఒక్కరికైనా, లేదా ఇద్రికైనా కూడా శారీరకంగా ఏవైనా సమస్యలు, తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం, ఊబకాయం, జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ తీసుకోవడం.. ఇవన్నీ కూడా సంతానరాహిత్యానికి ప్రధాన కారణాలు. కొందరు అప్పుడే పిల్లలు వద్దనుకుని కొన్ని సంవత్సరాల పాటు గర్భనిరోధ మందులు వాడటం వల్ల కూడా ఇబ్బందులు కలగొచ్చు. అయితే, సంతానరాహిత్యం అనేది తీవ్రమైన భావోద్వేగాలకు సంబంధించిన విషయం. ఈ సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండి, అర్థం చేసుకోవాలి తప్ప నెపం ఒకరి మీద ఒకరు నెట్టేసుకోవడం ఎప్పుడూ సరికాదు. సహజంగా పిల్లలు పుట్టనివారికి ఐవీఎఫ్ లాంటి చికిత్సలు ఉన్నాయి గానీ, అలా తీసుకోవడం అంటే సమాజంలో చిన్నచూపు చూస్తారన్న ఆందోళన చాలామందిలో కనిపిస్తోంది. అందువల్ల చాలామంది దంపతులు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పరు.
సంతానరాహిత్యానికి సమస్య ఎవరిలోనైనా ఉండొచ్చు. కానీ, ఇప్పటికీ ఆ లోపం అంతా మహిళదేనన్న భావన కనిపిస్తోంది. నిజానికి పురుషుల్లో సమస్య బాగా పెరుగుతోంది. త్వరలోనే మహిళల కంటే పురుషుల్లోనే సమస్య ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొంతవరకు అర్థం చేసుకుంటున్నా.. పట్టణాలు, నగరాల్లో మాత్రం ఇప్పటికీ పురుషాహంకారంతోనో మరేదైనా కారణం వల్లనో గానీ, మహిళల మీదే ఎక్కువగా నెపం నెట్టేస్తున్నారు. భార్యాభర్తలిద్దరికీ పరీక్షలు చేసినప్పుడు భార్య విషయంలో అన్నీ సాధారణంగా ఉండి భర్తలో లోపం కనిపించినా అంగీకరించట్లేదు. ఇటీవల నా దగ్గరకు ఓ జంట వచ్చారు. వారిలో భార్య రిపోర్టులన్నీ సాధారణంగానే ఉన్నాయి. భర్తకు వీర్యం కౌంటు బాగా తక్కువగా ఉంది. దాంతో ఐవీఎఫ్ చికిత్స తీసుకోవాలని సూచించాం. అతడు గానీ, అతడి కుటుంబ సభ్యులు గానీ ఆ విషయాన్ని అంగీకరించలేదు. భార్యను విపరీతంగా తిడుతూ, ఆమె మనసును తీవ్రంగా గాయపరిచారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో మేము పురుషులకు కౌన్సెలింగ్ చేస్తాం. ఇవన్నీ సర్వసాధారణమేనని, పరిస్థితిని అర్థం చేసుకోవాలని చెబుతాం. వీలైనంత వరకు వాళ్లకు వ్యక్తిగతంగా కౌన్సెలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తాం. కానీ ఇది ఎవరికి వారుగా తెలుసుకోవాల్సిన విషయం” అని ఆమె తెలిపారు. పిల్లలు పుట్టని జంటలకు డాక్టర్ హేమలత చేసిన కొన్ని సూచనలు ఇవీ..
1. రోజంతా ఐవీఎఫ్ గురించే ఆలోచించకండి. కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే దాని గురించి చర్చించండి. మీ రోజు మొత్తం దాని గురించే ఆలోచిస్తూ బుర్ర పాడుచేసుకోవద్దు.
2. ఈ సమస్య గురించి గూగుల్‌లో వెతికే ప్రయత్నం చేయొద్దు. సరైనవారిని, మిమ్మల్ని తగినదారిలో తీసుకెళ్లేవారినే అడగండి. ఎవరైనా డాక్టర్ గానీ, కౌన్సెలర్‌ను గానీ సంప్రదించండి.
3. ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోండి. మీరు దీని గురించి ఎవరి ప్రశ్నలకూ సమాధానాలు చెప్పక్కర్లేదు. మీరు పూర్తి సిద్ధంగా ఉన్నప్పుడే చెప్పండి.
4. మీ ఆరోగ్యం మీద దృష్టిపెట్టండి. వ్యాయామాలు చేయడం, మీకు ఇష్టమైన పనులు చేయడం మంచిది.
5. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తారనుకుంటే అలాంటి చోటకు వెళ్లద్దు, వెళ్లినా.. నో అని చెప్పడం అలవాటు చేసుకోండి.