PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పూర్తి స్వదేశీ స‌ర్జిక‌ల్ రోబోతో చిన్నారికి శ‌స్త్రచికిత్స‌

1 min read

* ప్రీతి యూరాల‌జీ అండ్ కిడ్నీ ఆస్పత్రిలో విజ‌య‌వంతంగా పైలోప్లాస్టీ

* తొలిసారిగా ఏడాది శిశువుకు స్వ‌దేశీ రోబోను ఉప‌యోగించిన డాక్టర్ చంద్రమోహ‌న్ వ‌ద్ది

పల్లెవెలుగు వెబ్  హైద‌రాబాద్ : స‌ర్జిక‌ల్ రోబోల వినియోగం ప్రపంచ‌వ్యాప్తంగా శ‌స్త్రచికిత్సల‌లో అత్యంత సుర‌క్షిత‌మైన‌దిగా నిరూపిత‌మైంది. ఇప్పటివ‌ర‌కు చాలావ‌ర‌కు స‌ర్జిక‌ల్ రోబోల‌ను పాశ్చాత్య దేశాల్లో మాత్ర‌మే త‌యారు చేస్తున్నారు. కానీ, ప్రస్తుతం భార‌త‌దేశంలోనూ వైద్య సాంకేతిక‌త కొత్త పుంత‌లు తొక్కుతోంది. అందులోభాగంగానే డాక్టర్ సుధీర్ ప్రేమ్ శ్రీ‌వాస్త‌వ‌, కొంద‌రు యువ భార‌తీయ ఇంజ‌నీర్లు క‌లిసి ఎస్ఎస్ఐ మంత్ర అనే పూర్తి స్వదేశీ స‌ర్జిక‌ల్ రోబోను రూపొందించారు. న‌గ‌రానికి చెందిన ప్రీతి యూరాల‌జీ అండ్ కిడ్నీ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, సీనియ‌ర్ యూరాల‌జిస్టు డాక్టర్ర చంద్రమోహ‌న్ వ‌ద్ది ఈ ఎస్ఎస్ఐ మంత్ర రోబోను ఉప‌యోగించి అద్భుత‌మైన విజ‌యం సాధించారు. కేవ‌లం ఏడాది వ‌య‌సున్న ఓ చిన్నారికి ఈ రోబో సాయంతో పైలోప్లాస్టీ అనే శ‌స్త్రచికిత్స చేసి, ఇంత చిన్న రోగికి రోబోటిక్ శ‌స్త్రచికిత్స చేసిన తొలి వైద్యుడిగా పేరు గ‌డించారు. మూత్రపిండానికి, బ్లాడ‌ర్‌కు మ‌ధ్య ఉండే జంక్షన్‌లో అడ్డంకుల‌ను తొల‌గించ‌డానికి చిన్నపాటి రంధ్రం ద్వారా చేసే శ‌స్త్రచికిత్సే రోబోటిక్ పైలోప్లాస్టీ. ఇందులో అడ్డంకుల‌ను పున‌ర్నిర్మించేచందుకు రోబోటిక్ ప‌రిక‌రాల‌ను ఉప‌యోగిస్తారు. త‌ద్వారా అత్యంత క‌చ్చితంగా చేయ‌డంతో పాటు త్వర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మూత్రపిండాల‌కు సంబంధించిన బ్లాకుల తొల‌గింపులో భ‌ద్రత‌, స‌మ‌ర్ధత కోసం సంప్రదాయ ప‌ద్ధతుల కంటే రోబోటిక్ శ‌స్త్రచికిత్సలే న‌యం. క‌ర్ణాట‌క‌లోని బీద‌ర్ నుంచి ఈ చిన్నారిని హైద‌రాబాద్‌లోని ప్రీతి యూరాల‌జీ అండ్ కిడ్నీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. త‌ల్లి గ‌ర్భంలో ఉన్నప్పుడే ఈ శిశువుకు మూత్రపిండానికి, బ్లాడ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్రాంతంలో అడ్డంకులు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా ఎడ‌మ‌వైపు మూత్రపిండం వాయ‌డంతో ఇక్కడ‌కు తీసుకొచ్చారు. న్యూక్లియ‌ర్ స్కాన్ చేసి చూడ‌గా ఎడ‌మ‌వైపు కిడ్నీలో తీవ్రమైన అడ్డంకులు ఉన్నట్లు తేలింది. దీనికి లాప్రోస్కోపిక్ లేదా రోబోటిక్ శ‌స్త్రచికిత్సలు మాత్రమే చేయాలి. ఇందులో ఎస్ఎస్ఐ మంత్ర రోబోను వినియోగిస్తే చాలా ప్రయోజ‌నాలు ఉంటాయి. 3డి విజ‌న్, పెద్దగా చూపించ‌డం, అత్యంత కచ్చిత‌త్వం, మెరుగైన ప‌రిక‌రాలు, టార్గెట్ ఏరియాకు సుల‌భంగా చేరుకోవ‌డం, చిన్నపాటి రంధ్రంతోనే ఇదంతా చేయ‌డం సాధ్యమ‌వుతుంది. దాంతోపాటు పూర్తిగా స్వదేశీ స‌ర్జిక‌ల్ రోబో కావ‌డంతో శ‌స్త్రచికిత్సకు అయ్యే ఖ‌ర్చు కూడా దిగుమ‌తి చేసుకున్న విదేశీ స‌ర్జిక‌ల్ రోబోల‌తో పోలిస్తే గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంది. ముందుగా తల్లిదండ్రుల‌తో పూర్తిగా చ‌ర్చించి, వారి అనుమ‌తి తీసుకున్న త‌ర్వాత డాక్టర్ చంద్రమోహ‌న్ విజ‌య‌వంతంగా ఈ చిన్నారికి ఎస్ఎస్ఐ మంత్ర రోబో సాయంతో రోబోటిక్ పైలోప్లాస్టీ శ‌స్త్రచికిత్స చేశారు. ఆప‌రేష‌న్ విజ‌య‌వంతం కావ‌డంతో రోగిని డిశ్చార్జి చేయ‌డానికి సిద్ధప‌డ్డారు. భార‌త‌దేశంలో చిన్నపిల్ల‌ల‌కు రోబోటిక్ శ‌స్త్రచికిత్సలు చేయ‌డంలో ఇదో పెద్ద మైలురాయి. ఇక‌పై పూర్తి స్వదేశీ ప‌రిజ్ఞానంతోనే స‌ర్జిక‌ల్ రోబోలు రావ‌డానికి మార్గం సుగ‌మ‌మైంద‌ని డాక్టర్ చంద్రమోహ‌న్ వ‌ద్ది ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్ఎస్ఐ మంత్ర అనేది త‌క్కువ ఖ‌ర్చుతో కూడుకున్న ప‌రిష్కార‌మ‌ని, ఇది మ‌న దేశంలో స‌ర్జిక‌ల్ ప్రక్రియ‌ల‌ను విప్లవాత్మకంగా మారుస్తుంద‌ని అన్నారు. సుర‌క్షితం, క‌చ్చితం, పైగా ఖ‌ర్చు త‌క్కువ కావడంతో మ‌రింత మందికి ఇది అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు.

ఎస్ఎస్ఐ మంత్ర‌- మేకిన్ ఇండియా

స్వదేశీ భారతీయ సర్జికల్ రోబో ఎస్ఎస్ఐ మంత్ర దేశీయంగా అధునాతన వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడం, ఉత్పత్తి చేసే విష‌యంలో భారతదేశ సామర్థ్యాన్ని ప్రదర్శించడం ద్వారా మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. డాక్టర్ సుధీర్ ప్రేమ్ శ్రీవాస్తవ నేతృత్వంలోని ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్ శ‌స్త్రచికిత్సల‌లో స్వావలంబన దిశగా ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. భారతీయ ఇంజనీర్లు అభివృద్ధి చేసిన ఈ రోబో అత్యాధునిక వైద్య ఆవిష్కరణలలో నాయకత్వం వహించే భారతదేశ సామర్థ్యానికి నిదర్శనం. దేశంలోనే ఎస్ఎస్ఐ మంత్రను తయారుచేయడం ద్వారా, భారతదేశం దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, దేశీయ వైద్య సాంకేతిక రంగంలో ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహిస్తుంది. అందువల్ల, మేకిన్ ఇండియా కార్యక్రమం లక్ష్యాలు, నైతికతకు ఎస్ఎస్ఐ మంత్ర గణనీయంగా దోహదం చేస్తుంది. డాక్టర్ సుధీర్ ప్రేమ్ శ్రీవాస్తవ నేతృత్వంలో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన భారతీయ సర్జికల్ రోబోటిక్ వ్యవస్థ ఎస్ఎస్ఐ మంత్ర. సంక్లిష్టమైన శస్త్రచికిత్సా విధానాలను మెరుగైన క‌చ్చితత్వం, సామర్థ్యంతో చేయడంలో సర్జన్లకు సహాయపడటానికి రూపొందింది. 3డిలో చూపించ‌డం, మ‌రింత క‌చ్చిత‌త్వాన్ని అందించే మ‌ణిక‌ట్టు ప‌రిక‌రాలు, రోగికి ట్రామాను త‌గ్గించ‌డంతో పాటు వేగంగా కోలుకునేందుకు వీలుగా చిన్న‌పాటి రంధ్రంతోనే చేయ‌గ‌ల సామ‌ర్థ్యం దీనికి ఉన్నాయి.

About Author