ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లు దాటితే రూ.4 వేలు పెన్షన్..
1 min readకర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భరత్
16వ వార్డు స్వామిరెడ్డి నగర్లో టి.జి భరత్ భరోసా యాత్ర
.సమస్యలు మొరపెట్టుకున్న స్థానికులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లు దాటితే రూ.4 వేలు పెన్షన్ ఇస్తామని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టిజి భరత్ అన్నారు. నగరంలోని 16వ వార్డు పరిధిలోని స్వామిరెడ్డి నగర్లో ఆయన టి.జి భరత్ భరోసా యాత్ర పేరుతో ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం చేపట్టారు. దివ్యాంగుల పింఛన్ 6 వేలకు పెంచుతున్నామని, 100 శాతం అంగవైకల్యం ఉంటే రూ. 15 వేలు అందిస్తామన్నారు. ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్నారు.
ప్రతి పేద కుటుంబాన్ని సంపన్నులుగా మార్చేందుకు తమ తెలుగుదేశం ప్రభుత్వంలో కృషి చేస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఇంటికీ త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. చిన్న మద్య తరహా పరిశ్రమలకు రూ. 10 లక్షల సబ్సిడీ ఇస్తామని చెప్పారు. యువతకు ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. కర్నూల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే స్థానికంగా కొత్త పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు తప్పకుండా కృషి చేస్తానని యువతకు భరోసా ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు తాను ముందుంటానన్నారు. ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇక అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే కర్నూల్లో తాను ఎమ్మెల్యేగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అర్హులకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు అందించే బాధ్యత తాను తీసుకుంటానని భరత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, సీనియర్ నేతలు రామాంజనేయులు, బాబ్జి, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.