ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో ఉన్నా.. కర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భరత్
1 min readవైసీపీ నుండి టిడిపిలోకి చేరికలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రజాసేవ కోసమే తాను రాజకీయాల్లో ఉన్నట్లు కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ తెలిపారు. నగరంలోని ఆయన కార్యాలయంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలో 46వ వార్డుకు చెందిన వైసీపీ నేతలు రామరాజు, సులేమాన్, నాగరాజు, అంజి, తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం విద్యా నగర్‌కు చెందిన కిరణ్, అనంతమ్మ, అజయ్, మాధవిలు లలితమ్మ, రాజేష్ ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు. టి.జి భరత్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీలో చేరిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. కులం, మతం పక్కనపెట్టి కర్నూలు ప్రజల సేవలో తామున్నామన్నారు. 40 సంవత్సరాలుగా కర్నూల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికలకు 45 రోజుల ముందు ఓ వ్యక్తి వచ్చి గెలిపించండి సేవ చేస్తామంటే నమ్మొద్దని ఆయన కోరారు. తన తండ్రిలాగే తాను కూడా కర్నూల్ ప్రజలకు మంచి చేస్తానన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని 6 గ్యారెంటీలు తీసుకొచ్చానన్నారు. తాను గెలిచి తమ ప్రభుత్వం వచ్చాక ఈ 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తానని చెప్పారు. తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే తన పనితీరు ఏంటో ప్రజలందరికీ తెలుస్తుందన్నారు. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసేలా నాయకులు, కార్యకర్తలు చైతన్యం తీసుకురావాలని టి.జి భరత్ కోరారు. అనంతరం ఎంపీ అభ్యర్థి నాగరాజు మాట్లాడుతూ కర్నూలు నగరం సమస్యలతో కొట్టుమిట్టాడుతోందన్నారు. టి.జి భరత్‌ను గెలిపిస్తే ప్రజలకు ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. 6 గ్యారెంటీలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు కూడా వేయొద్దంటున్న గొప్ప నాయకుడు టి.జి భరత్ అని నాగరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.