మాటిస్తున్నా.. అండగా ఉంటా…
1 min readముస్లింలకు స్పష్టమైన హామీ ఇచ్చిన టీజీ భరత్
- 11వ వార్డు వైసీపీ కార్పొరేటర్ ఫరాజ్ ఆలీఖాన్ టీడీపీలో చేరిక..
కర్నూలు, పల్లెవెలుగు:కర్నూలు నియోజకవర్గంలోని ముస్లింలకు సంక్షేమం, అభివృద్ధి అందించేందుకు తాను ముందుండి కృషి చేస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. నగరంలోని మాసుంబాషా దర్గా సమీపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 11వ వార్డుకు చెందిన వైసీపీ కార్పొరేటర్ ఫరాజ్ ఆలీఖాన్ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈయనతో పాటు ఆయన సోదరుడు ఫైజల్ ఆలీ ఖాన్, భారీగా మహిళలు, యువత సైతం టిడిపిలో చేరారు. టి.జి భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్పొరేటర్ ఫరాజ్ కు… అభినందన…
అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా కేవలం నాపై నమ్మకంతో కార్పొరేటర్ ఫరాజ్ టిడిపిలో చేరారని తెలిపారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రజలకు పనులేమీ చేయలేని పరిస్థితిలో కార్పొరేటర్లు ఉన్నారని చెప్పారు. ఈ ఐదేళ్లలో తమ పార్టీ నుండి కార్పొరేటర్లు, కీలక నాయకులు ఎవ్వరూ పార్టీని విడిచి వెళ్లలేదన్నారు. అయితే వైసీపీ నుండి తమ పార్టీలోకి కార్పొరేటర్లు, కీలక నాయకులు వచ్చేస్తున్నారన్నారు. ఐదేళ్లపాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వైసీపీని రాష్ట్రం నుండి తుడిచిపెట్టేయాలన్నారు.
ముస్లింలకు… భరోసా…
ఇక కర్నూల్లో పదేళ్లుగా తాము అధికారంలో లేకపోయినా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నామన్నారు. అయితే అధికారంలో ఉంటే అభివృద్ధి పనులు ఎక్కువ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని టి.జి భరత్ ప్రజలను కోరారు. తనను గెలిపిస్తే మసీదులను కూల్చేస్తామన్న తప్పుడు ప్రచారాన్ని టి.జి భరత్ ఖండించారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లో ఉంటున్న తాము ఎప్పటికీ ముస్లింలకు కీడు చేయాలని ఆలోచించిన దాఖలాలు లేవన్నారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం చేసే ఇలాంటి వ్యాఖ్యలు నమ్మొద్దని ఆయన ముస్లింలను కోరారు.
టీడీపీ మేనిఫెస్టోలో… ముస్లింలకు వరాలు..
తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ముస్లిం మైనారిటీలకు మేలు జరుగుతుందని చెప్పారు. తమ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో ముస్లింల కోసం ఎన్నో మంచి సంక్షేమ పథకాలు ఉన్నాయని వివరించారు. హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ.1 లక్ష సాయం చేస్తామన్నారు. ఇమామ్, మౌజన్‌లకు ప్రతి నెలా రూ. 10 వేలు మరియు రూ.5 వేలు గౌరవ వేతనం ఉంటుందన్నారు. నూర్ బాషా కార్పోరేషన్ ఏర్పాటుచేసి ప్రతి ఏటా రూ. 100 కోట్లు కేటాయిస్తామని.. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ. 5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి మెహబూబ్ ఖాన్, టిడిపి మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ బాషా, మైనారిటీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మన్సూర్ ఆలీఖాన్, టిడిపి నాయకురాలు జమీలా బేగం, నౌషాద్, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.