బలహీన వర్గాల ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి
1 min readఆ ప్రజలపైనే దాడులు చేయటం శోచనీయం
కూటమి అభ్యర్థులకే బీసీల మద్దతు
రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకరరావు
అర్హత లేని పదవులతో బీసీలను ఓటు బ్యాంకుగా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు
ఏలూరు కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్
అణచివేత ధోరణికి చెమర గీతం పాడి, స్వేచ్ఛాయుత పాలన అందించడo కూటమికె సాధ్యం
ఏలూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి
పల్లెవెలుగు, ఏలూరు జిల్లా ప్రతినిధి : బలహీనవర్గాలకు చెందిన ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి వారిపైనే దాడులు జరిగేలా రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తోన్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకరరావు, ఏలూరు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్ధి పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి, జనసేన, బీజేపి కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేట చంటి విమర్శించారు. ఏలూరు శాంతినగర్‌లోని ఎంపీ అభ్యర్ధి క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకరరావుకు అత్మీయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా టిడిపి, జనసేన, బీజేపి కూటమికి ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో శంకరరావు మాట్లాడుతూ బీసీల పట్ల ముఖ్యమంత్రి జగన్ ప్రదర్శిస్తున్న విధానాలను ఎండగట్టారు. సామాజిక న్యాయం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అన్నిరంగాల్లోనూ అదే విధానాలను కొనసాగించారా అని ప్రశ్నించారు. ఈ విధానాలను ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగానే ఏలూరుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆయన మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి తనకు అత్యంత అప్తులన్నారు. వారి సోదరునిగా బడేట చంటి టిడిపిలో తనకున్న ప్రత్యేకతను చాటుకునే విధంగా ముందుకెళ్తున్నారని, అలాగే విద్యావంతుడైన పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌కి పార్లమెంట్ సీటు కేటాయించడం బీసీల పట్ల చంద్రబాబుకున్న నిబద్దతకు నిదర్శనమన్నారు. తన చుట్టూ ఉండేందుకు అర్హతలేని బీసీలు, తన గెలుపునకు మాత్రం అవసరమయ్యారా అని మండిపడ్డారు. బీసీలను ఓటుబ్యాంకుగా మాత్రమే జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని ఆయన అన్నారు. ఏలూరు అసెంబ్లీ కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అణచివేత దోరణికి చరమగీతం పాడి స్వేచ్ఛాయుత పాలన అందించడం టిడిపి, జనసేన, బీజేపి కూటమితోనే సాధ్యమన్నారు. బీసీలే వెన్నెముకలుగా గుర్తించిన టిడిపి తొలి నుండి వారికి వెన్నుదన్నుగా ఉంటూ వస్తోందని స్పష్టం చేశారు. ఈ విషయం గుర్తుంచుకున్న ప్రతి బీసీ సోదరుడు టిడిపికి బ్రహ్మరథం పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపు తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.