ప్రజలపై కరెంటు బిల్లుల భారం తగ్గిస్తాం.. కర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భరత్
1 min readగడ్డా వీధిలో టి.జి భరత్ భరోసా యాత్ర
టి.జి భరత్‌తో కలిసి ప్రచారం చేసిన శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎం.ఏ షరీఫ్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తమ ప్రభుత్వం వచ్చాక ప్రజలపై కరెంటు బిల్లుల భారం తగ్గిస్తామని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ చెప్పారు. నగరంలోని గడ్డా ప్రాంతంలో ఆయన శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎం.ఏ షరీఫ్‌తో కలిసి టి.జి భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి పెద్దలు, మహిళలు, యువతను కలిసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని నాయకులు కోరారు. ఈ ఐదేళ్లలో 5 సార్లు కరెంటు బిల్లులు పెంచారని ఆయన మండిపడ్డారు. పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముస్లింలు కులం, మతం చూడకుండా తెలుగుదేశం పార్టీని ఆదరించాలన్నారు. కర్నూల్లో 40 ఏళ్లుగా టి.జి కుటుంబం ప్రజాసేవలోనే ఉందన్నారు. అధికారంలో ఉంటే ప్రజలకు మరింత సేవ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి ఏమీ చేయకుండా ప్రజలకు సమస్యలను మిగిల్చిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామని వారు తెలిపారు. ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చి భవన నిర్మాణ రంగం కార్మికులకు పనులు పెరిగేలా చేస్తామన్నారు. అన్ని వర్గాలకు లబ్ది చేకూరే విధంగా చంద్రబాబు నాయుడు పాలన ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జి అర్షద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, బూత్ ఇంచార్జీలు, తదితరులు పాల్గొన్నారు.