వైసీపీ పాలనలో ప్రజలపై ఖర్చుల భారం.. : టి.జి భరత్
1 min readఅశోక్‌నగర్‌లో 44, 45, 46 వార్డుల ఆత్మీయ సమావేశం
- సమావేశంలో పాల్గొన్న టి.జి భరత్, శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎం.ఏ షరీఫ్
కర్నూలు, పల్లెవెలుగు:వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలపై ఖర్చుల భారం పెరిగిపోయిందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. నగరంలోని అశోక్ నగర్లో 44, 45, 46 వార్డుల ఆత్మీయ సమావేశంలో శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎం.ఏ షరీఫ్‌తో పాటు టి.జి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 ఏళ్లుగా తనకు కర్నూలు ప్రజలతో అనుబంధం ఉందన్నారు. ఇక్కడి సమస్యలను దగ్గర నుండి చూశానని, ఎమ్మెల్యేగా గెలిచి వీటిని పరిష్కరించి, నగరాన్ని అభివృద్ధి చేయాలన్న తపన తనకుందన్నారు. 45 రోజులుగా కర్నూలులో ఉంటున్న తన ప్రత్యర్థి వైసీపీ నాయకుడికి ఇక్కడి ఇబ్బందులు ఎలా తెలుస్తాయన్నారు. ఒక్క పరిశ్రమ వస్తే కర్నూలు రూపురేఖలు మారిపోతాయన్నారు. కంపెనీలు ఇక్కడకు తీసుకొచ్చే సత్తా తనకుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఎమ్మెల్యేగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని టి.జి భరత్ కోరారు. అనంతరం ఎం.ఏ షరీఫ్ మాట్లాడుతూ సమావేశానికి హాజరైన ప్రజలను చూస్తుంటే టి.జి భరత్ భారీ మెజారిటీతో గెలుస్తారని స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ముస్లింల రిజర్వేషన్లపై వైసీపీ రాజకీయాలు నమ్మొదన్నారు. వాజ్‌పేయి హయాంతో పాటు మోడీ హయాంలో సైతం టిడిపి ఎన్డీయేలో భాగస్వామిగా ఉందన్నారు. ముస్లింలను ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పెట్టలేదన్నారు. 4 శాతం రిజర్వేషన్లు రాష్ట్రానికి సంబంధించిన అంశమన్నారు. టిడిపి దీనికి కట్టుబడి ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయన్నారు. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జి అర్షద్, టిడిపి 44, 45, 46 వార్డుల ఇంచార్జీలు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, బూత్ ఇంచార్జీలు, తదితరులు పాల్గొన్నారు.