PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదోనిని కాపాడుకుందాం…

1 min read

నియోజకవర్గ అభివృద్ధి… నా బాధ్యత..

  • యువతకు ఉపాధి…ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తాం..
  • ఒక్కసారి ఆశీర్వదించండి…
  • కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

 ఆదోని, పల్లెవెలుగు: కర్నూలు జిల్లాలోనే ఆదోని అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి ఉందన్నారు కూటమి (బీజేపీ–జనసేన–టీడీపీ) అభ్యర్థి డా. పార్థసారధి. పట్టణం, గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు అల్లాడిపోతుంటే… ఏనాడూ ఆలోచించని వ్యక్తి ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి… అటువంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఇస్తే… ఆదోని సర్వనాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పట్టణంలోని పలు కాలనీల్లో కూటమి నేతలు విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా డా. పార్థసారధి మాట్లాడుతూ  ఆదోనిలో బతకాలంటే…. ఎమ్మెల్యే అనుమతి ఉండాల్సిన దుస్థితి నెలకొనే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యేకు… నాకు ఎటువంటి వ్యక్తిగత కక్షలు లేవని,  మీ కోసం నేను పోరాడుతున్నానన్నారు. రోడ్లు, మురుగు కాల్వలు, వీధిలైట్లు, తాగునీరు వసతి కల్పించలేని ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డిని మూడు సార్లు గెలిపించారని, ఆయన మిమ్మల్ని మోసం చేస్తున్నాడని వెల్లడించారు.

యువతకు ఉపాధి…

ఆదోనిలో చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు లేక బెంగళూరు,హైదరాబాద్​, కర్నూలుకు వలస వెళ్తున్నారని,  ఇక్కడే నైపుణ్య శిక్షణ తరగతులు ఉంటే…. అన్ని రంగాల్లో రాణిస్తారనని డా. పార్థసారధి స్పష్టం చేశారు. తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి… గెలిపిస్తే…. యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.  కేంద్రంలో వచ్చేది ఎన్డీయే అని, రాష్ట్రంలో వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఆదోని అభివృద్ధికి అవసరమైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో, ఇంకా అవసరమైతే దేశ ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడుతానని పేర్కొన్నారు. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేసి… గెలిపించాలని కోరారు.

About Author