బీజేపీతో పొత్తును ముస్లింలు స్వాగతిస్తున్నారు.. కర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భరత్
1 min readకల్లూరుదర్వాజా, లక్ష్మీనగర్‌లో టి.జి భరత్ భరోసా యాత్ర
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బీజేపీతో టిడిపి పొత్తును ముస్లింలు స్వాగతిస్తున్నారని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. నగరంలోని 8వ వార్డు కల్లూరుదర్వాజా, 24వ వార్డు లక్ష్మీనగర్‌లో ఆయన టి.జి భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలిసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ ప్రభుత్వం ఆపేసిన సంక్షేమ పథకాలు మళ్లీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలుచేస్తామని హామీ ఇచ్చారు. టిడిపి, జనసేన, బీజేపీ పొత్తు ఎలాంటి పరిస్థితుల్లో కుదిరిందో ముస్లింలు గ్రహించారన్నారు. ఈ అరాచక ప్రభుత్వాన్ని సాగనంపాలంటే అందరూ ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందని తనను కలిసిన ముస్లిం సోదరులు చెప్పినట్లు టి.జి భరత్ పేర్కొన్నారు. బీజేపీతో టిడిపి కలిసి ఉన్నప్పుడే ముస్లింలకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రంజాన్ తోఫా, షాదీ ముబారక్ పథకాలు అందడం లేదన్నారు. ఈ పథకాలు అందకపోవడం వల్ల ముస్లింలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారు. కర్నూలు నగరంలో ఉన్న ముస్లింలు తనకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారని టి.జి భరత్ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. తాను గెలిచిన తర్వాత కర్నూలు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తరలివచ్చి ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పరమేష్, రవనమ్మ, టిడిపి నాయకులు, బూత్ ఇంచార్జీలు, తదితరులు పాల్గొన్నారు.