PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సమస్యలపై పోరాడుతున్న SUCI(C) పార్టీ అభ్యర్థులను గెలిపించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  సమాజంలో సమూల మార్పుకై, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న SUCI(C) పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థులతో కలిసి నగరంలో ప్రచారం నిర్వహిస్తూ స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు MLA అభ్యర్థి కామ్రేడ్ వి. హరీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ – ప్రజాస్వామ్యం పేరుతో నేడు మన దేశంలో జరుగుతున్న ఎన్నికలు ఎలా తయారయ్యాయో మనం చూస్తున్నామని, ధన బలం, అధికార బలం, కండబలం, మీడియా బలం ఉన్న పార్టీలదే పైచేయి అయి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. ఈ చతురంగ బలాలను పెట్టుబడిదారీ వర్గం, కార్పొరేట్ కంపెనీలు తెరవెనుక నుండి బూర్జువా పార్టీలకు సమకూర్చి పెడుతున్నాయని, ఎన్నికల బాండ్ల కుంభకోణం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపారు. అధికారంలోని బిజెపితో పాటు, ఇతర పాలక బూర్జువా పార్టీలు ఏ విధంగా కేంద్ర సంస్థలను ఉపయోగించుకుని పెట్టుబడిదారి దోపిడీ సంస్థలతో కుమ్మక్కై వేలకోట్ల రూపాయలతో ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఎలా ప్రయత్నిస్తున్నాయో స్పష్టమైందని, ఆ విధంగా ఒక బూర్జువా పార్టీ లేదా కూటమికి మద్దతునిచ్చి అధికారంలోకి తెస్తాయని తెలిపారు. మన దేశంలో మొదటి సాధారణ ఎన్నికలప్పటినుండి నేటి 18వ దఫా ఎన్నికల వరకు జరుగుతున్న తతంగం ఇదే అని చెప్పారు. ఎన్నికలలో ఒక ప్రభుత్వాన్ని పార్టీని లేదా నాయకున్ని తొలగించి మరొక ప్రభుత్వాన్ని, పార్టీని లేదా నాయకున్ని తెచ్చినప్పటికీ పెట్టుబడిదారీ దోపిడీ, పీడనలు అంతం కావని, ప్రజల కష్టాలు తీరవని, అందుకే వారి జీవితాలలో ఏ మౌలిక మార్పు లేదని, కాలం గడిచే కొద్ది సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే సమాజంలో సమూలమైన మార్పు కొరకు ప్రజాతంత్ర ప్రజా ఉద్యమ నిర్మాణం మాత్రమే నిజమైన ప్రత్యామ్నాయ మార్గమని భావించి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు… ఎస్ యు సి ఐ (సి)పార్టీ కర్నూలు MP, MLA అభ్యర్థులను ప్రజలు బలపరచాలని, మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు.సోషలిస్టు యూనిటీ  సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) – SUCI(C) పార్టీ ఎన్నికల అభ్యర్థులైన కర్నూలు శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి వి. హరీష్ కుమార్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఎం. నాగన్న, నగరంలోని పలు కూడళ్లలో సమావేశాలు నిర్వహించి, ప్రజలను కలసి ప్రచారం నిర్వహించారు. ఎస్.యు.సి.ఐ.(సి) పార్టీ రాష్ట్ర నాయకులు ప్రమీల, బసవరాజు సభ్యులు ఖాదర్, శ్రీమన్నారాయణ, మల్లేష్, ఈరన్న, జగదీష్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.

About Author