ఐదేళ్లు ప్రజలకు కష్టం రాకుండా చూసుకుంటా: టీజీ భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఒక్కసారి తనకు ఓటు వేసి గెలిపిస్తే.. ఐదేళ్లపాటు కర్నూలు నియోజకవర్గ ప్రజలకు కష్టం రాకుండా చూసుకుంటానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 45వ వార్డు మమతా నగర్, ఆయుష్మాన్ ఆసుపత్రి ప్రాంతం, 44వ వార్డు రామలింగేశ్వర్ నగర్, వెంకటరమణ కాలనీ ప్రాంతాల్లో ఆయన టీజీ భరత్ భరోసా యాత్ర చేపట్టారు. ఇంటింటికి వెళ్లి మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. డమ్మీ ఈవీఎం మిషన్లు చూపించి.. ఎలా ఓటు వేయాలో ప్రజలకు వివరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో పెట్టుబడులు రాక రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక రాయితీలు ప్రకటించి.. ఏపీకి కంపెనీలు తీసుకువస్తారని అన్నారు. ఇక కర్నూలుకు తాను ఎమ్మెల్యే అయ్యాక ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చారు. పారిశ్రామికవేత్తగా తనకు ఉన్న అనుభవంతో కర్నూలుకు పరిశ్రమలు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో కర్నూలు రూపురేఖలు మార్చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యేగా తనకు ఒక్క అవకాశం ఇచ్చి.. తన పనితీరు చూడాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, జనసేన నాయకులు, బూత్ ఇంఛార్జ్‌లు పాల్గొన్నారు.