PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రరంభించిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్

1 min read

విద్యార్థులను దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేది తరగతి గదులే

కేంద్రీయ విద్యాలయంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు :  విద్యార్థులను దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేది తరగతి గదిలేనని అలాంటి సమర్థమైన వ్యవస్థ కేంద్రీయ విద్యాలయం లోనే ఉందని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మంచి ప్రదేశాలలో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయని చెప్పారు. ఇందులో విద్యార్థులను దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దే విధంగా బోధన, శిక్షణ కార్యక్రమాలు ఉంటున్నాయని ఆయన వివరించారు. కేంద్రీయ విద్యాలయాలు సమర్థతకు మారుపేరుగా కొనసాగుతున్నాయని చెప్పారు. కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సంబంధించి విద్యాలయంతో తనకి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఈ కార్యక్రమానికి తనను ప్రిన్సిపల్ ప్రియదర్శిని మేడం ఆహ్వానించడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని వివరించారు. ఇది తనకు లభించిన గౌరవం ని ఆయన వివరించారు. నేటి బాలలే రేపటి పౌరులని దేశ భవిష్యత్తుకు నిజమైన పెట్టుబడులు వీరేనని ఆయన వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా హింస చలరేగిపోతుందని, పలు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. కేవలం మానసిక నియంత్రణ లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఆత్మ న్యూనత భావం, ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకోవడం వంటి కారణాల వల్ల ఇలాంటి హింసాత్మక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు .ప్రస్తుతం వేసవి మండుటెండలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నాయని ఇది కేవలం మానవ తప్పిదాల వల్ల జరిగిన పరిణామం అని వివరించారు. వాతావరణ కాలుష్యం మితిమీరి పెరిగిపోవడం వల్ల పర్యావరణం దెబ్బతిని ఓజోన్ పొర దెబ్బతిని వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆయన వివరించారు. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. మొక్కై వంగనిది మానై వంగదని సామెత ఉందని అందువల్లే చిన్నతనంలోనే విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. చిన్నతనంలోనే వారికి మంచి అలవాట్లను నేర్పించాలని సూచించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక ఆరోగ్య మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని వివరించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల యోగ, ప్రాణాయామం వంటి ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో అంశాలకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఉత్తమ విద్యా బోధనలకు నిలయాలైన కేంద్రీయ విద్యాలయంలో యోగా గురువులను నియమించడం ద్వారా విద్యార్థులకు మరింత ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయని ఇందుకోసం అవసరమైతే ఉన్నత అధికారులతో మాట్లాడి కాంట్రాక్టు విధానంలో యోగా గురువును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థులను ఆరు నుంచి ఎనిమిది గంటల్లోగా క్రీడల్లో సాధన చేసే విధంగా చూడాలని ఆయన చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేసవి ఎండల నేపథ్యంలో బయటికి రాకుండా ఉండటం మంచిదని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు.

About Author