ప్రజల క్షేమం కోసమే.. పోరాటం..
1 min readరాంజల నిర్మాణానికి రూ.70 కోట్ల మంజూరైతే… మింగేసిన దుర్మార్గుడు
- వారానికోసారి మంచినీరిస్తే.. ఎలా బతుకుతారు…
- ఆదోని నాశనం అయింది…
- ప్రజలను మోసం చేస్తే… ఎలా బాగు పడతాడు…
- ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై మండిపడ్డ కూటమి అభ్యర్థి డా. పార్థసారధి
- పద్మశాలీయుల ఆత్మీయ సమ్మేళనంలో
ఆదోని, పల్లెవెలుగు:కర్నూలు జిల్లాలోనే ఆదోని అభివృద్ధిలో వెనుకబడిందని, ఇందుకు ప్రధాన కారణం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అని ఘాటుగా విమర్శించారు కూటమి (బీజేపీ–జనసేన–టీడీపీ) అభ్యర్థి డా. పార్థసారధి. ప్రజలను పురుగుల కంటే హీనంగా చూస్తూ…. రౌడీ రాజ్యం సాగిస్తున్నాడని ఆరోపించారు. శుక్రవారం పట్టణంలోని మార్కెండేయ స్వామి దేవాలయం ఆవరణలో పద్మశాలీయుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన కూటమి అభ్యర్థి డా. పార్థసారధి మాట్లాడుతూ వేసవి వచ్చిందంటే….నియోజకవర్గంలో వారానికోసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు…. దీనికి కారణం ఎవరు అని ప్రజలను ప్రశ్నించారు. రాంజల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 70 కోట్లు మంజూరు చేస్తే….ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దిగమింగాడని ధ్వజమెత్తారు. అలాగే బసాపురం ట్యాంకును వందల కోట్ల రూపాయలు మంజూరు చేస్తే… తన అనుచరుడికే కాంట్రాక్టర్ ఇచ్చి నిర్మించాడు. ప్రస్తుతం ట్యాంకు కుంగిపోయింది. దీంతో సగం మాత్రమే నీరు నిల్వ చేయాలని నిపుణులు చెప్పడంతో …. సగం ట్యాంకు నింపుతున్నారు. ఈ సమస్య కారణంగా ఆదోని ప్రజలకు వారానికోసారి తాగునీరు వదులుతున్నారు. ఇలా ప్రజలను మోసం చేస్తే… ఎలా బాగు పడతాడని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జాదారుడు… మద్యం, ఇసుక, రేషన్ , మట్కా మాఫియాను పెంచి పోషిస్తున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వొద్దని… వైసీపీకి ఓటు వేయొద్దని పద్మశాలీయులను కోరారు.
పద్మశాలీయులు… ఆశీర్వదించండి…
ఆదోని అభివృద్ధికి కట్టుబడి ఉంటానని… పద్మశాలీయుల అభ్యున్నతికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని… తనను ఆశీర్వదించాలని అభ్యర్థించారు కూటమి అభ్యర్థి డా. పార్థసారధి. ఒకప్పుడు రెండవ ముంబాయిగా పేరుగాంచిన ఆదోనిలో చేనేతలు అధికంగా ఉన్నారని, చేనేతలకు అండగా ఉంటానన్నారు. పద్మశాలీయల సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఈ సందర్భంగా డా. పార్థసారధి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి… తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆదోని పద్మశాలి సంఘం అధ్యక్షుడు బుదారపు లక్ష్మన్న, సభ్యులు క్యామ శీను, గోపాల్, జక్కా వీరేష్, వీరసేన, క్రాంతినగర్ శివ తదితరులు పాల్గొన్నారు.