PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రత… నిత్యం అప్రమత్తంగా ఉండాలి

1 min read

ఏర్పాట్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, మరియు ఎస్పీ

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆర్జీయం, శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా చర్యలు అత్యంత పకడ్బందీగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డిలు భద్రతా సిబ్బందిని ఆదేశించారు. గురువారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఈవీఎం బాక్స్ లను భద్రపరచిన ఆర్జీయం, శాంతిరాం ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల కేంద్ర పోలీస్ బలగాల గార్డులు, జిల్లా ఆర్మ్డ్ పోలీస్ గార్డులు, సివిల్ పోలీస్ బందోబస్తు కౌంటింగ్ వరకు అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ గట్టి బందోబస్తు నిర్వహించాలన్నారు. భద్రతా చర్యల్లో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. స్ట్రాంగ్ రూముల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నిరంతరం సీసీ కెమెరాలు నిరంతరం పర్యవేక్షించేలా పోలీసుల పహారా వుండాలని ఆదేశించారు. డిఎస్పీ స్థాయి అధికారి 24 గంటల పాటు భద్రతను పర్యవేక్షిస్తుంటారన్నారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్లను కూడా ఏర్పాటు చేసామన్నారు. స్ట్రాంగ్ రూములు తెరిచే ముందు మరియు మూసే సమయంలో సీసీటీవీ కెమెరాల్లో సీల్ కనిపించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిసి ఫుటేజ్ లు అన్ని కమాండ్ కంట్రోల్ కు కనెక్ట్ చేయబడి… 24 గంటలు సిబ్బంది పర్యవేక్షిస్తూ ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసు పికెట్లు, మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  గ్రామాల్లో ప్రజలు ఎటువంటి గొడవలకు వెళ్లకుండా గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా పోలీస్ యంత్రాంగం నిరంతరం  పనిచేస్తుందన్నారు. జిల్లాలో పోలీసు యంత్రాంగం అన్ని భద్రత చర్యలు చేపట్టడం జరిగిందని ప్రజలు రాజకీయ పార్టీలకు ఎక్కడైనా ఇబ్బందులు కలిగిన తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా పోలీసులు అందరూ అందుబాటులో ఉంటారన్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని.. అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. అపోహలు, తప్పుడు సమాచారాలు నమ్మి ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే పోలీసు శాఖ తీవ్రంగా పరిగణించి అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

About Author