ఇసుక ర్యాంపులో ఆకస్మిక తనిఖీ
1 min readసుప్రీంకోర్టు , ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు
జిల్లా కలెక్టర్ డా జి. సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు/ఆదోని: సుప్రీంకోర్టు , ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఇసుక ర్యాంపులో లోడింగ్ చేసిన, ఇసుక లారీలు తరలించినా చట్ట ప్రకారం జరిమానా, కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ డా జి. సృజన పేర్కొన్నారు.ఆదోని డివిజన్ కౌతళo మండలంలోని గుడికంబళి , మరళి గ్రామంలో ఇసుక ర్యాంపులను మరియు నది తీరంలో అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ డా జి. సృజన ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా ఇసుక ర్యాంపులో నిల్వ ఉన్న ఇసుక వివరాల గురించి మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ ని అరా తీశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ప్రదేశం, సమయంలోనే ఇసుకను సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా లారీలో ఇసుకను అధికంగా తరలించకూడదని, తరలిస్తే సంబంధిత లారీలపై చర్యలు తీసుకొని జరిమానా విధిస్తామని తెలిపారు. అంతే కాకుండా చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడానికి ఆదేశాలు ఉన్నాయని హెచ్చరించారు. అదే విధంగా ఇసుక రిచ్ కేంద్రాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని ముఖ్యంగా లారీలు, టిప్పర్లు, జేసిబి లు వెళ్ళే దారిలో సిసి కెమెరాలు పక్కగా ఉండేటట్లు ఏర్పాటు చేసి నిరంతరం మానిటరింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలన్నారు.కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సైలేశ్వర్, కౌతాళం తహశీల్దారు అలెగ్జాండర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శశిర దీప్తి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.