PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నాం

1 min read

జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. కె. శ్రీనివాసులు

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: సాధారణ ఎన్నికలు – 2024లో భాగంగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా సిద్ధం చేస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. కె. శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం ఆయన ఛాంబర్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పై మీడియా వాయిస్ ద్వారా వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. కె. శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పక్కగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ను ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లోని ఈవియంలకు మూడు అంచెల భద్రత కల్పించామన్నారు. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను వెబ్ కాస్టింగ్ ద్వారా కనెక్ట్ చేయబడిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాలలో బ్యారీ కేడింగ్, ఐరన్ మెస్  ఏర్పాటు తదితర పనులు జరుగుతున్నాయన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు/ఎలక్షన్ ఏజెంట్ పాసుల జారీ నిమిత్తం ఈనెల 27వ తేదీలోగా వివరాలు ఇవ్వాలని సంబంధిత రాజకీయ పార్టీలకు తెలిపామన్నారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల వద్ద సిఏపిఎఫ్, ఎస్ఏపి, సివిల్ బలగాలను ఏర్పాటు చేశామని, అన్ని కౌంటింగ్ కేంద్రాలలో, స్ట్రాంగ్ రూముల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మరియు కౌంటింగ్ కోసం అడిషినల్ ఏఆర్ఓలు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందని, కౌంటింగ్ అధికారులకు మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేసి మూడు రోజుల్లో శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తామన్నారు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాల సన్నద్ధంగా ఉంటూ పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నామని… ఇందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. జూన్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని నలుగురుకు మించి వ్యక్తులు ఎవరు గుమికూడి ఉండరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని కలెక్టర్ తెలిపారు. బాణసంచా సామాగ్రి విక్రయాలను కూడ నిషేధించామని కలెక్టర్ వెల్లడించారు.

About Author