ఉచిత సమ్మర్ క్యాంపు…
1 min readయోగా, డ్యాన్స్‌లో రాణిస్తున్న అమ్మాయిలు
- 40 మందికి పైగా శిక్షణ పొందుతున్న వైనం
ఆదోని, పల్లెవెలుగు:వేసవి సెలవులను పిల్లలు వృధా చేయడంలేదు. ఎవరికి నచ్చిన క్రీడలలో వారు రాణిస్తున్నారు. ఇందుకు పిల్లల తల్లిదండ్రులు కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. పిల్లల భిన్నాప్రాయాలు…విభిన్న ఆలోచనలకు తల్లిదండ్రులు రూపమిస్తున్నారు. కరాటే, కర్ర,కత్తిసాము, కుంగ్ ఫూ, స్విమ్మింగ్, టెన్నీస్, క్రికెట్, ఫుట్‌బాల్ వంటి క్రీడలపై ఆసక్తి చూపుతుంటే…. మరికొందరు డ్యాన్స్, యోగాపై శిక్షణ పొందుతున్నారు. ఎవరి ఆలోచన… ఆసక్తి తగ్గట్టు క్రీడలను ఎంచుకుని.. వాటిలో ప్రతిభ చాటుతున్నారు. ఆదోనిలో ఉచిత సమ్మర్ క్యాంపునకు విశేష స్పందన లభిస్తోంది. స్థానిక విశ్వహిందూ పరిషత్ కార్యాలయ ఆవరణలో దాదాపు 40 మంది అమ్మాయిలు ఉచిత డ్యాన్స్, యోగా శిక్షణ పొందుతున్నారు. కరాటే మాస్టర్ కేశవ్ నేతృత్వంలో… డ్యాన్స్ మాస్టర్లు ఈరన్న గౌడ్, నటరాజ్ ఆధ్వర్యంలో అమ్మాయిలు డ్యాన్స్, యోగాలో శిక్షణ తీసుకుంటున్నారు. అదేవిధంగా కళాభారత్ నేతృత్వంలో ఉచితంగా కరాటే, యోగా, ధ్యానం, వ్యక్తిత్వ మనోవికాసంపై నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ తరగతులకు యువతీయువకులు ఆసక్తి చూపుతున్నారు. శారీరక దృఢత్వం…ఆరోగ్యంపై దృష్టి పెట్టిన యువత …ఏదో ఒక క్రీడపై ఆసక్తి చూపుతుండటం… ఇందుకు తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో సహకరించడం .. శుభ పరిణామమని మేధావులు చెబుతున్నారు.