కృష్ణా జలాల కోసం.. ఉద్యమిస్తాం..
1 min read– కేఆర్ఎంబీ కర్నూలులోనే ఏర్పాటు చేయాలి
– ఏపీ రైతు సంఘం నాయకులు రమేష్ బాబు
పల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: శ్రీశైలం ప్రాజెక్టులో భాగంగా నీరు నిల్వకోసం రాయలసీమ ప్రజలు, రైతులు 50వేల ఎకరాలు త్యాగం చేశారని, ప్రాజెక్టు కోసం ధారాదత్తం చేసిన రాయలసీమవాసులకే కృష్ణాజలాలు వాడుకునే హక్కు ఉందన్నారు ఏపీ రైతు సంఘం నాయకులు ఎం.రమేష్ బాబు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడుబంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ రైతాంగానికి సాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో కాలువ వెడల్పు చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశంతో ప్రాజెక్టు నిర్మించడం లేదని, ఇప్పటికే రాయలసీమ రైతాంగానికి, ప్రజలకు కనీసం తాగడానికి గుక్కెడు నీరు లేక అల్లాడిపోతున్న గ్రామాలు అనేకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా అనేక ప్రాజెక్టులు నిర్మిస్తూ నీటిని ఉపయోగిస్తుందని, రాయలసీమ ప్రాంతం వాళ్లు మాత్రం న్యాయం గా వరద జలాలు ఉపయోగిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం పోరాటం చేయాల్సింది రాయలసీమ ప్రభుత్వంపై కాదని ఎగువన నీటి దోపిడికి గురి చేస్తున్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాల అని హితవు పలికారు. అదే విధంగా రాయలసీమ రైతాంగానికి నాలుగు వందల టీఎంసీల నీటిని కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా కృష్ణానది జలాలకు ముఖద్వారంగా ఉన్న కర్నూలు లో కృష్ణ నది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలకు రైతులకు జరుగుతున్న అన్యాయం పై రేపు ప్రాజెక్ట్ ల పరిశీలన కు వస్తున్న కృష్ణానది యాజమాన్య బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారన్నారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు అహ్మద్, స్వాములు శ్రీనివాసులు, నరసింహా, భూషణ, తదితరులు పాల్గొన్నారు.