రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్‌లో 41 శాతం నిధులు కేటాయించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 41 శాతం భూభాగం ఉన్న రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్‌లో 41 శాతం నిధులు కల్పంచడంతో పాటు, రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ప్రాంతంతో సమానంగా రాయలసీమ సాగునీటి రంగ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్‌లో మరో 20 శాతం నిధులను కేటాయించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సిద్దేశ్వరం అలుగు ప్రజా శంఖుస్థాపన 8 వ వార్షికోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా సిద్దేశ్వరం సమీపంలోని సంగమేశ్వరం దగ్గర రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో “రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు – సమగ్రాభివృద్దిపై” విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాయలసీమ ఎనిమిది జిల్లాల నుండి ప్రజా సంఘాలు, రైతు, న్యాయవాద, విధ్యార్థి సంఘాలు, వందాలది రైతులతో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దశరథరామిరెడ్డి మాట్లాడుతూ… రాయలసీమ ప్రత్యేక ఇరిగేషన్ కమీషన్ ఏర్పాటుతో పాటు, రాయలసీమలో చట్టబద్దమైన నీటి హక్కులను పరిరక్షిస్తూ వాటి సంపూర్ణ వినియోగానికీ, ప్రాజెక్టుల సక్రమ నిర్వహణకు కావలసిన గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి ఎత్తిపోతల పథకం, తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, RDS కుడి కాలువ ప్రాజెక్టులను యుద్దప్రాతిపదికన చేపట్టాలని కోరారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న తెలుగుగంగ, గాలేరు – నగరి, హంద్రీనీవా, వెలుగొండ సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలి, విభజన చట్టం ప్రకారం దుమ్ముగూడెం – నాగార్జున సాగర్ టేల్పాండ్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి, తద్వారా ఆదా అయిన కృష్ణా జలాలను పై ప్రాజెక్టులకు అందించాలని అన్నారు.పాలనా వికేంద్రీకరణలో భాగంగా హైకోర్టు, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం, సీడ్ హబ్, హార్టికల్చర్ హబ్, వ్యవసాయ, ఉద్యానవన, విశ్వ విద్యాలయాలతో పాటు రాష్ట్ర స్థాయి కార్యాలయాలను రాయలసీమలో ఏర్పాటు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అనేక హక్కులను కల్పించినదనీ కానీ పాలకులు వాటిని అమలుపరచకుండా గతంలో ఉన్న నీటి హక్కులను కూడా కాలరాస్తున్న నేపథ్యంలో మే 31, 2016 న వేలాదిమంది రైతులతో సిద్దేశ్వరం అలుగు ప్రజా శంఖుస్థాపన జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకోవాలని కోరారు. పోలవరం, అమరావతిలో నవకేంద్రాలంటూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధిని విస్మరించడంతో 2019 లో వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం జరిగిందనీ కానీ వైసీపి ప్రభుత్వం కూడా జీవో నెంబర్ 365 ను తీసుకొచ్చి రాయలసీమ ప్రాజెక్టులను శిథిల ప్రాజెక్టులుగా మార్చిందన్నారు.సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్డీ మిషన్ రాయలసీమ పేరుతో ఇచ్చిన హామిని రాయలసీమ ప్రజలు విశ్వసించి తెలుగుదేశం పార్టీకి అత్యధిక సీట్లు ఇచ్చారని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ హామీలను నెరవేర్చడానికి తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని కోరారు. నూతన ప్రభుత్వం ఆరు నెలలలోపు కార్యాచరణ ప్రకటించక పోతే భవిష్యత్తు కార్యాచరణను చేపట్టి ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు అరుణ్, విరసం నాయకులు పాణి, వరలక్ష్మి, SDPI, జనసేన తాహెర్ వలి, CPIM శంకరయ్య, AIKS రాజశేఖర్, CPI ఆత్మకూరు బాద్యులు శ్రీనివాసులు, స్వాములు, ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కుల వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి, BKS కడప జిల్లా నాయకులు రంగారెడ్డి, రాష్ట్ర మహిళా నాయకురాలు మణెమ్మ, అనంతపురం జిల్లా OPDR నాయకులు శ్రీనివాసులు, రాయలసీమ సాంస్కృతిక వేదిక, రాయలసీమ అభ్యదయ సంఘం, అనంతపురం , కర్నూలు జలసాధన సమితి, రాయలసీమ విధ్యార్థి సంఘం, రాయలసీమ మేధావుల ఫోరం, కె.సి.కెనాల్, తెలుగుగంగ, SRBC ఆయకట్డు సంఘం నాయకులు, కుందూ పరిరక్షణ , న్యాయవాద సంఘాలు, రైతు కూలీ సంఘం, యాగంటి బసవేశ్వర రైతు సంఘం, జన విజ్ఞాన వేదిక, DTF నాయకులు రత్నం ఏసేఫు, అట్ల అధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి మరియు రాయలసీమ ప్రాంతం నుంచి వందలాది రైతులు పాల్గొన్నారు.