రక్తదానం చేయండి..ప్రాణదాతలు కండి
1 min readమల్టీస్పెషాలిటీ ఆసుపత్రిగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతాం
ప్రపంచ రక్తదాతల దినోత్సవంలో పాల్గొన్న శాసన సభ్యులు బడేటి రాధ కృష్ణయ్య(చంటి)
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆరోగ్యవంతమైన ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి)తెలిపారు. శుక్రవారం స్ధానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవంలో శాసన సభ్యులు బడేటి చంటి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం మరోకరికి ప్రాణదానం చేయడమేనని ఆయన పేర్కొన్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రక్తాన్ని సేకరించి ప్రాణాపాయంలోవున్న వారికి సేవలందించడంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా పలుమార్లు రక్తదానం చేసిన రక్తదాతలను శాసన సభ్యులు చంటి ప్రత్యేకంగా అభినందించారు. స్వచ్ఛంధ రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడే రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపే అవకాశంగా ప్రపంచ రక్తదాత దినోత్సవం జరుపుకొనే ముఖ్యఉద్ధేశ్యమన్నారు. రక్తదానం చేయడం వలన కొందరి నిండుప్రాణాలను కాపాడటంతోపాటు, రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు. ఈ దృష్ట్యా ఆరోగ్యవంతులు, యువత, రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ప్రతి నెల రూ. 25 వేలు విరాళంగా ఇస్తున్న అడుసుమిల్లి సుబ్రహ్మణ్యాన్ని అభినందించారు. ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రిని మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అవసరమైన నిధులను తీసుకురావడానికి కృషిచేస్తామని తెలిపారు. ఏలూరు ప్రజలు తమపై ఎంతో విశ్వాసంతో ఉంచిన బాధ్యతను అంకితబావంతో 24 గంటలు ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా కృషిచేస్తానని అన్నారు. తొలుత రెడ్ క్రాస్ ఆవరణలో మొక్కలు నాటి, రక్తదాన సేకరణ మొబైల్ వాహనంలో రక్తదాన శిబిరాన్నిఆయన ప్రారంభించారు. అనంతరం రెడ్ క్రాస్ సేవలలో భాగస్వాములైన పలువురు దాతలకు, అధికార, అనధికారులకు, సిబ్బందిని ఆయన సత్కరించి మెమొంటోను అందజేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏలూరు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బి.వి. కృష్ణారెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలు గురించి వివరించారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఉచితంగా విద్యనభ్యసించిన వారికి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సహకారంతో ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నారని ఈ సందర్బంగా ఆయన జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డియంహెచ్ఓ డా. శర్మిష్ట, సూపరింటెండెంట్ విజయ, డిసిహెచ్ పాల్ సతీష్, ఆలపాటి నాగేశ్వరరావు, నిర్మల, ఆర్.ఎన్ ఆర్ ,మాస్టర్ కృష్ణారావు, డా. వరప్రసాద్, హౌసింగ్ డి యం రవికుమార్,సెట్వెల్ సీఈవో మెహ్రజ్,డిప్యూటీ డి యం హెచ్ వో నాగేశ్వరరావు,పలువురు డాక్టర్లు, దాతలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.