PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాతృభాష తెలుగు మీడియం విద్యాబోధన కొనసాగించాలి.. ఏపీటీఎఫ్

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంను కూడా కొనసాగించాలని ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి. శ్రీనివాసులు జిల్లా కార్యదర్శులు మానపాటి రవి, ఆవుల మునిస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం స్థానిక గడివేములలో జరిగిన ఏపీటీఎఫ్ సమావేశంలో వారు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం మార్చిలో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను విద్యార్థులు కేవలం ఆంగ్ల మాధ్యమంలోనే రాయాల్సి ఉంటుందని ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేద , దళిత వర్గాల విద్యార్థులు తెలుగు మీడియం లేకపోవడం, ఇంగ్లీష్ మీడియంలో చదవలేక వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఇప్పటికైనా ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తో పాటు తెలుగు మీడియంను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గారు యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రాథమిక విద్యావ్యవస్థ నాశనం కావడానికి కారణమైన జీవో నెంబర్ 117 ను తక్షణమే రద్దు చేయాలని, అలాగే ప్రాథమిక పాఠశాలలలోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనాన్ని రద్దుచేసి ప్రాథమిక విద్యను కాపాడాలని వారు కోరారు. తల్లికి వందనం పథకమును కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని, పాఠశాలల నిర్వహణకు నిధులు మంజూరు చేయాలని, గత సంవత్సరం నుండి నిధులు లేక ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 28 వేల ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని, 5 సంవత్సరముల నుండి డీఎస్సీ నోటిఫికేషన్ లేనందున నిరుద్యోగ ఉపాధ్యాయులకు వయోపరిమితిని 47 సంవత్సరములకు పెంచాలని వారు అన్నారు. ఉపాధ్యాయుల బోధనకు ఆటంకంగా మారిన వివిధ రకాల యాప్ లను రద్దుచేసి కేవలం బోధనకు మాత్రమే పరిమితం చేయాలని, అలాగే మున్సిపల్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు పదోన్నతులను, బదిలీలను చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం. ప్రతాపరెడ్డి, ఎల్. బాలస్వామి, రాష్ట్ర కౌన్సిలర్లు ఏ. నాగన్న, ఎస్. మహబూబ్ బాషా, ఎస్. బాల వెంకటేశ్వర్లు, బి.రాంపుల్లారెడ్డి, చంద్రశేఖర ఆచారి, నాగయ్య, మల్లికార్జునయ్య, జి. శ్రీరాములు, జిల్లా మహిళాప్రతినిధి యు. కవిత ఎన్. లక్ష్మీదేవి, ఆదిశేషమ్మ, పుష్పకుమారి, కోమలమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author