ట్యాంకుల శుద్ధీకరణ షురూ..
1 min readగ్రామాల్లో వెయ్యి దాకా వాటర్ ట్యాంకులు శుభ్రం
- ప్రజలకు మంచినీరు అందించడమే లక్ష్యం
- పంచాయతీరాజ్ శాఖ జిల్లా అధికారి నాగరాజు నాయుడు
కర్నూలు, పల్లెవెలుగు: గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు మంచినీరు అందించడమే లక్ష్యమన్నారు పంచాయతీ రాజ్ శాఖ జిల్లా అధికారి నాగరాజు నాయుడు. బుధవారం ఆయన ఛాంబరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కలెక్టర్ జి. సృజన ఆదేశాల మేరకు … జిల్లాలోని 484 గ్రామపంచాయతీలు, అదనంగా 230 గ్రామాల్లోని వాటర్ ట్యాంకులు, నీటితొట్లు, పైపులైన్లు తదితర తాగునీటికి సంబంధించినవన్నీ శుభ్రం చేయిస్తున్నామన్నారు. జిల్లాలో మొత్తం 3349 వాటర్ ట్యాంకులు ఉండగా మంగళ,బుధవారాల్లో దాదాపు వెయ్యి ట్యాంకులను శుభ్రం చేశామని, మిగిలినవి నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున… ముందు జాగ్రత్త చర్యగా కర్నూలు జిల్లాలోని వాటర్ ట్యాంకులు, నీటితొట్లు, పైపులైన్లు తదితరవి శుభ్రం చేసే పనిలో సిబ్బంది నిమగ్నమైనట్లు ఆయన పేర్కొన్నారు. ట్యాంకుల శుభ్రతకు గ్రామీణ ప్రజలు, రాజకీయ నాయకులు పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ జిల్లా అధికారి నాగరాజు నాయుడు పేర్కొన్నారు.