రబీలో కరువు పరిస్థితిపై కేంద్ర కరువు బృందం సమీక్ష
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల: 2023-24 రబీ సీజన్ లో ఏర్పడిన కరువు పరిస్థితులను జిల్లా కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు కేంద్ర కరువు బృందానికి వివరించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కరువు పరిస్థితుల అధ్యయనంపై కేంద్ర కరువు బృందం వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కరవు పరిస్థితులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం సభ్యులు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండేచర్ డైరెక్టర్ చిన్మయ పుండ్లిక్ రావు గాట్మేర్ (ఐఏఎస్), తాగు నీరు, పారిశుద్ధ్యశాఖ డిప్యూటీ అడ్వైజర్ (పీహెచ్ఈ) ఆషిస్ పాండే, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ అరవింద కుమార్ సోనిలకువివరించారు. జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2023-24 రబీకి సంబంధించి 13 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 33 శాతం మించి అధిక పంట నష్టం 59,207 హెక్టార్లలో పప్పు సెనగ, మినుము, కంది, పొగాకు, జొన్న మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. పంట సాగు చేసిన 58,011మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని కలెక్టర్ వివరించారు. 2023-24కు సంబంధించి అక్టోబర్ నుంచి మే నెల వరకు మైనస్ 21.14 శాతం వర్షపాతం తక్కువగా నమోదు అయిందన్నారు. భూగర్భ జలాలకు సంబంధించి 2023 మే నెలలో 6.84 మీటర్ల లోతులో ఉండగా, నవంబర్ నాటికి 7.01 మీటర్లకు, మే 2024 నాటికి 11.42 మీటర్ల లోతుకు వెళ్లాయని కలెక్టర్ వెల్లడించారు. భూగర్భ జలాలు ఎండిపోవడం కారణంగా నీటి వనరులు లేక టాంకర్ల ద్వారా నీటిని రవాణా చేశామన్నారు. రబీ 2023-24 లో తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా జిల్లాలో 58,011 మంది రైతులకు సంబంధించి 59,207 హెక్టార్లకు ఎన్.డి.ఆర్.ఎఫ్ నిబంధనల ప్రకారం 57.30 కోట్లు ఇన్పుట్ సబ్సిడీకి ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ, అర్బన్ వాటర్ సప్లై నష్టం వివరాలను పూర్తిగా తెలియజేశారు. ఉపాధి హామీ కింద వందరోజుల పని దినాల కల్పన, అదనంగా 50 రోజుల పనుల కల్పన, తదితర అంశాలను వివరించారు.ఈ సందర్భంగా ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం అధికారులు మాట్లాడుతూ కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి తయారు చేసిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. రబీ 2023-24లో కరువు పరిస్థితిపై ఆరా తీస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూగర్భ జలాలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వివరాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం కింద ఎంత మంది 100 రోజుల పని పూర్తి చేసుకున్నారు, గత ఐదేళ్లలో 100 రోజుల పని పూర్తి చేసిన మండలాలు ఎన్ని ఉన్నాయి, ఉపాధి హామీ కింద అదనంగా మరో 50 రోజుల పని దినాలు ఎక్కడెక్కడ కావాలని అడుగుతున్నారు, గత ఏడాది వేజ్ ఎంప్లాయిమెంట్, క్రాఫ్ కటింగ్ ఎక్స్పరిమెంట్, పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. . ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, ఆర్ డబ్ల్యు ఎస్ ఈ మనోహర్, భూగర్భ జల శాఖ డిడి రఘురాం, డిఆర్ఓ మల్లికార్జున రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఇ వెంకటరమణయ్య, డ్వామా పిడి రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.