PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్రిలియ‌స్ టెక్నాల‌జీస్ ప‌దో వార్షికోత్సవ సంబ‌రాలు

1 min read

* ముఖ్య అతిథిగా హాజ‌రైన సాయి సిల్క్స్ క‌ళామందిర్ గ్రూప్ ఛైర్మన్, వ్యవ‌స్థాప‌కులు ప్రసాద్ చ‌ల‌వాది

* ప్ర‌త్యేక అతిథులుగా అమెరికా నుంచి ఐటీ సెర్వ్ వ్యవ‌స్థప‌క‌, బోర్డు స‌భ్యులు

* 200 మందికి పైగా ఉద్యోగులు, కుటుంబ‌స‌భ్యులు, పిల్లల  సంద‌డి

* అల‌రించిన కూచిపూడి నృత్య ప్రద‌ర్శన‌లు

పల్లెవెలుగు వెబ్ హైద‌రాబాద్ : ప‌దేళ్ల క్రితం.. అంటే 2014లో ఒక స్టార్టప్ కంపెనీగా ప్రారంభ‌మైన బ్రిలియ‌స్ టెక్నాల‌జీస్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో 30 మిలియ‌న్ డాల‌ర్ల కంపెనీగా ఎదిగింది. ఈ ద‌శాబ్ద వార్షికోత్సవాన్ని న‌గ‌రంలో ఘ‌నంగా నిర్వహించారు. సాయి సిల్క్స్ క‌ళామందిర్ గ్రూప్ ఛైర్మన్, వ్యవ‌స్థాప‌కులు ప్రసాద్ చ‌ల‌వాది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక అతిథులుగా అమెరికా నుంచి ఐటీ సెర్వ్ వ్యవ‌స్థప‌క‌, బోర్డు స‌భ్యులు వ‌చ్చారు. సంస్థలో ప‌నిచేస్తున్న దాదాపు 200 మంది ఉద్యోగులు, వాళ్ల కుటుంబ‌స‌భ్యులు, స్నేహితులు హాజ‌రై ఈ సంద‌డిలో పాలుపంచుకున్నారు. సీఈఓ రామ్ న‌రేష్ దండా, వైస్ ప్రెసిడెంట్‌ ప్రవీణ్ మ‌ద్దిప‌ట్ల‌, డైరెక్టర్‌ గురు కొమ్మినేని జ్యోతిప్రజ్వల‌నం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ పాఠ‌శాల‌ల‌కు చెందిన విద్యార్థులు ఐదు ర‌కాల కూచిపూడి నృత్య రూప‌కాల‌ను ప్రద‌ర్శించగా అవి ఆహూతుల‌ను ఎంత‌గానో అల‌రించాయి. అనంత‌రం బ్రిలియ‌స్‌లో మూడు, అంత‌కంటే ఎక్కువ సంవ‌త్సరాలు ప‌నిచేసిన‌వారికి బ‌హుమ‌తులు అందించారు.ఈ సంద‌ర్భంగా సంస్థ సీఈఓ రామ‌న‌రేష్ దండా మాట్లాడుతూ, “2014లో బ్రిలియ‌స్‌ను స్థాపించాం. ఈ ప‌దేళ్లలో ఎంతో సాధించాం. మొద‌టి ఐదేళ్లు చాలా క‌ష్టప‌డ్డాం. మొద‌ట వారానికి వంద గంట‌ల చొప్పున ప‌నిచేయ‌డం, ప‌ని చేయ‌డానికి ఆర్థికంగా మ‌ద్దతు కావాలి. ఇవ‌న్నీ మొద‌ట్లో మేం ఎదుర్కొన్న స‌మ‌స్యలు. ఐదేళ్ల త‌ర్వాత ఇక వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. 2019 నాటికి కంపెనీ 15 మిలియ‌న్ డాల‌ర్ల అమ్మ‌కాలు సాధించింది. ఇప్పుడు 30 మిలియ‌న్ డాల‌ర్లకు ఎదిగింది. ఇందుకు ఉద్యోగుల నిబ‌ద్ధతే కార‌ణం. వ‌చ్చే ప‌దేళ్ల‌లో మ‌నం కంపెనీని ఒక‌సారి కాదు, రెండుసార్లు రెట్టింపు చేయాలి. మ‌న‌మంతా క‌లిసి దాన్ని సాధిస్తాం. అదే మ‌న ల‌క్ష్యం. 0-30 చాలా క‌ష్టం. 30-60 అంత క‌ష్టం కాదు. ఇప్పుడు మ‌నం ఏం చేయాలో మ‌న‌కు తెలుసు. అది చేస్తే చాలు. మ‌నం చాలా టెక్నాల‌జీల‌లోకి విస్తరించాం. క్లౌడ్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మీద కూడా దృష్టిపెట్టాం. స‌రైన స‌మ‌యానికి స‌రైన టెక్నాల‌జీని ఎంచుకోవ‌డం వ‌ల్ల ఇప్పుడు ఇంత విజ‌యం సాధించాం. ఏఐ, మెషీన్ లెర్నింగ్ కోసం కొత్త ఉద్యోగుల‌ను కూడా తీసుకుంటున్నాం. ఇప్ప‌టికే ఫార్చూన్ 100 క్లయింట్లు అయిన అమెజాన్, యాపిల్, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి సంస్థల‌కు సేవ‌లు అందిస్తున్నాం. ఏఐ రంగంలోనూ మ‌రింత‌మందికి మా సేవ‌లు అందించాల‌ని భావిస్తున్నాం” అని చెప్పారు. అనంత‌రం వైస్ ప్రెసిడెంట్‌ ప్రవీణ్ మ‌ద్దిప‌ట్ల మాట్లాడుతూ, “ఇప్పటికే అమెరికా, ఇండియాల‌లో మా సంస్థ కార్యక‌లాపాలు కొన‌సాగుతున్నాయి. త్వర‌లోనే కెన‌డా, మెక్సికో ప్రాంతాల్లోనూ స్థాపించాల‌నే ఉద్దేశంతో ఉన్నాము. అలాగే ఏఐ రంగంలోకి కూడా విస్తరించే ఆలోచ‌న ఉంది. ఇప్పటివ‌ర‌కు మా సంస్థలో గానీ, ఇత‌ర సంస్థల‌కు గానీ దాదాపు 800 మందికి పైగా ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించాం. గ‌డిచిన ప‌దేళ్లుగా మ క్లయింట్లు, భాగ‌స్వాముల‌కు ప్రతిరోజూ ప్రతి ప్రాజెక్టులోనూ అద్భుత‌మైన సేవ‌లు అందించ‌డ‌మే మా ప్రధాన బ‌లం. రాబోయే కొన్నేళ్లలో ప్రపంచ‌వ్యాప్తంగా మ‌రింత‌మంది క్లయింట్లకు సేవ‌లు విస్తరిస్తాం, ప‌లు రంగాల‌లో ఏఐ సొల్యూష‌న్స్ అందిస్తాం” అన్నారు.డైరెక్టర్‌ గురు కొమ్మినేని మాట్లాడుతూ, “బ్రిలియ‌స్ ను 2014లో ప్రారంభించిన‌ప్పుడు చాలా చిన్నది. ఇప్పుడు వేర్వేరు ప్రాంతాల్లో కార్యాల‌యాలు ఉన్నాయి. ఇప్పుడు 250 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. మొద‌ట్లో డెవ్ ఆప్స్‌తో ప్రారంభించాము. త‌ర్వాత ప‌లు ర‌కాల ఐటీసేవ‌లు అందిస్తున్నాం. ప్రపంచంలో ప‌లు ర‌కాల కంపెనీల‌కు మా ఐటీసేవ‌లు అందుతున్నాయి. కొవిడ్ స‌మ‌యంలో చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాం. గ‌త ఏడాది నుంచి కూడా సాఫ్ట్ రెసిష‌న్ వ‌ల్ల కొన్ని ఇబ్బందులు వ‌స్తున్నాయి. వాటిని అధిగ‌మించి ముందుకెళ్తామ‌న్న న‌మ్మకం ఉంది” అని చెప్పారు. స‌రిగ్గా ప‌దేళ్ల క్రితం.. అంటే 2014లో కేవ‌లం ఒక స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన బ్రిలియస్ టెక్నాలజీస్ సంస్థ‌.. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో గణనీయంగా ఎదిగింది. క్లయింట్లు తమ వ్యాపార లక్ష్యాలను సాధించడంలో సహాయపడే అత్యాధునిక పరిష్కారాలను అందిస్తూ సంస్థ ప్రపంచ‌వ్యాప్తంగా అంచెలంచెలుగా ఎదిగింది. డెవ్ ఆప్స్, క్లౌడ్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌, బ్లాక్ చెయిన్ లపై ప్రాథమిక దృష్టితో, బ్రిలియస్ టెక్నాలజీస్ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఈ-కామర్స్, టెక్నాలజీ, హెల్త్ కేర్, టెలికమ్యూనికేషన్స్ లాంటి రంగాలలోని సంస్థలకు సేవ‌లు అందిస్తోంది. ఇప్పుడు ఏఐ, మెషీన్ లెర్నింగ్ మీద దృష్టి సారించి మ‌రో రెండు దేశాల‌కు విస్తరించే యోచ‌న‌లో ఉంది.

About Author