పరిశ్రమల అనుసంధానంతో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చండి
1 min readవిదేశాల్లో ఉద్యోగావకాశాలకు కేరళ విధానాలను అధ్యయనం చేయండి
స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష
పల్లెవెలుగు వెబ్ అమరావతి: రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలతో కలిసి పనిచేయాలని మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఐటిఐ, పాలిటెక్నిక్ కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతి ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీని స్థానికంగా ఉన్న దేశీయ, విదేశీ కంపెనీలతో కలిసి నైపుణ్యాలను పెంచేందుకు ప్రణాళికలు తయారుచేయాలని సూచించారు. ఇందులో భాగంగా అమరావతిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (న్యాక్) సెంటర్, మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యూయలరీ ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పేందుకు సర్వే నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు విభాగాల వారీగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఇందుకు ప్రతి అధికారి చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. విదేశాల్లో ఉపాధి కల్పనపై కేరళ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీ సౌరభ్ గౌర్, స్కిల్ డెవలప్ మెంట్ ఎండీ రాజబాబు, ఎంప్లాయ్ మెంట్ అండ్ ట్రైనింగ్ డైరక్టర్ నవ్య, సీడ్ యాప్ సీఈవో శ్రీనివాసులు, న్యాక్ ఏడీజీ దినేష్, ఓమ్ క్యాప్ జీఎం క్రాంతి కుమారి తదితరులు పాల్కొన్నారు.