నంద్యాల జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బొజ్జా దశరథరామిరెడ్డి
1 min readరాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై కలెక్టర్ కు వివరించిన బొజ్జా..
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆద్వర్యంలో సమితి కార్యవర్గ సభ్యులు జిల్లాకు నూతనంగా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రాజకుమారి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి అంశాలతో పాటు ప్రధానంగా నంద్యాల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, నీటి లభ్యతలపై కలెక్టర్ గారికి బొజ్జా వివరించారు. గోరుకల్లు రిజర్వాయర్ ప్రమాదపుటంచులలో వుందని కలెక్టరు కు తెలిపారు. జిల్లాలో అత్యంత పురాతనమైన కే సి కెనాల్ ఆయకట్టుకు ఏరోజు వరుకు నీటిని అందిస్తారో చెప్పలేని పరిస్థితి ఉండటంతో ఏ పంటలు వేసుకోవాలో, వేసిన పంటలకు నీరందుతుందో లేదో అన్న మనోవేదనతో రైతులు వ్యవసాయం కొనసాగిస్తున్నారని కలెక్టర్ కు వివరించారు. సాగునీటి జిల్లా సాగునీటి వనరులు, ప్రాజెక్టుల గురించి కలెక్టర్ బొజ్జాతో చర్చించారు. ఈ సందర్భంగా తాను రచించిన “నీటి అవగాహనే రాయలసీమకు రక్ష” పుస్తకాన్ని కలెక్టర్ గారికి బొజ్జా అందచేసారు. సాగునీటి అంశాలను తెలుసుకోవాలని వున్నా ప్రస్తుతం సమయం లేనందువలన త్వరలో మలి విడత భేటీలో సాగునీటి అంశాలను చర్చిద్దామని ఈ సందర్భంగా కలెక్టర్ బొజ్జాకు తెలిపారు. కలెక్టర్ తో భేటీ అనంతరం మీడియాతో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులపై కలెక్టర్‌కి వివరించినప్పుడు వారి స్పందన బాగుందని, రాయలసీమ సాగునీటి అంశాలను తెలుసుకోవాలన్న తపన వారిలో వుండటం మాకు చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు. నీటి అవగాహనే రాయలసీమకు రక్ష పుస్తకం పూర్తిగా చదివిన తరువాత మరొకసారి కూర్చుని సాగునీటి అంశాలను చర్చిద్దామన్న కలెక్టర్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నామని బొజ్జా అన్నారు.కలెక్టర్ ని కలిసిన బృందంలో సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, మహేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు వున్నారు.