నగరపాలక అధికారులతో మంత్రి టి.జి. భరత్ సమీక్ష
1 min readతాగునీరు, రోడ్ల విస్తరణ, పారిశుధ్యంపై చర్చ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగర సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రివర్యులు టి.జి. భరత్ అన్నారు. మంగళవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో నగర పాలక సంస్థ అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ముందుగా నగర పాలక సంస్థ కమిషనర్ ఏ.భార్గవ్ తేజ నగరాభివృద్ధికి సంబంధించి తీసుకుంటున్న చర్యలు, వాటి స్థితిగతులను మంత్రికి వివరించారు. గత నెల 15వ తేదీన నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాల అమలుపై మంత్రి ఆరా తీశారు.అమృత్-2 పథకానికి సంబంధించి మంజూరై, నిలిచిపోయిన జగన్నాథ గట్టు మీద రూ.130 కోట్లతో 50 ఎంఎల్‌డి నీటి శుద్ధి కేంద్రం, అలాగే 21 ఈఎస్ఎల్ఆర్ ట్యాంకుల నిర్మాణం, తుంగభద్ర నది ఒడ్డున రూ.122 కోట్లతో 35 ఎంఎల్‌డి మురుగు నీరు శుద్ది కేంద్ర నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. నగర ప్రజలకు పూర్తిగా స్థాయిలో తాగునీరు అందించేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. తాగునీటి సరఫరా సాధ్యమైనంత రాత్రివేళల్లో కాకుండా పగలు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.కిడ్స్ వరల్డ్ నుంచి ఉస్మానియా కళాశాల మీదుగా కలెక్టరేట్ వరకు పెండింగ్లో ఉన్న రోడ్డు విస్తరణ పనులపై దృష్టి పెట్టాలని, రోడ్డు విస్తరణ బాధితులతో సమావేశం నిర్వహించి, వారికి తగిన న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ వధ్ద యస్ఎపి క్యాంపులో నుంచి బస్టాండ్ సమీపంలో ప్రవేశించేలా రూపొందించిన 60 అడుగుల రోడ్డు విషయమై 2వ పటాలం పోలీస్ అధికారులతో మాట్లాడాలని మంత్రి సూచించారు.సీజనల్ వ్యాధుల నివారణకు పారిశుధ్యంపై ఇంకా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఆటోల ద్వారా చిన్నచిన్న సందుల్లో కూడా హైపో ద్రావణాన్ని పిచికారీ చేయాలని మంత్రి పేర్కొన్నారు. పూడికతీత పనులు మరింతగా వేగంగా చేపట్టాలని తెలిపారు.సమావేశంలో అదనపు కమిషనర్ రామలింగేశ్వర్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ చంద్రమౌళి, నగర పాలక ఎస్.ఈ. డి.వేణు గోపాల్, ఎంఈలు షాకీర్, శేషసాయి, ఆరోగ్యధికారి విశ్వేశ్వర రెడ్డి, ఇంచార్జీ సిటి ప్లానర్ సంధ్య, మేనేజర్ చిన్నరాముడు, సెక్రటరీ నాగరాజు, హార్టికల్చర్ ఏడీ విజయలక్ష్మి, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.