గత పాలకుల నిర్లక్ష్యంతో పడకేసిన అభివృద్ధి
1 min readసంబంధిత అధికారులపై మండిపడ్డ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
పరిస్థితులను ఎమ్మెల్యే కి వివరించిన కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నగరంలో అభివృద్ధి పడకేసిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మండిపడ్డారు. పారిశుద్ద్య నిర్వహణ విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని సిబ్బందిని ఆయన హెచ్చరించారు. ఏలూరులోని 4వ డివిజన్లో నీటమునిగిన రోడ్లను, ఆ ప్రాంతంలో తాండవిస్తోన్న అపారిశుద్ద్యాన్ని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే చంటి ఆయా పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడేది లేదని హెచ్చరించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ప్రతినిత్యం కృషిచేస్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోవడం, వెనువెంటనే నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవడం, అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వస్తున్నారాయన. దీంతో ఎమ్మెల్యే బడేటి చంటి స్పందనపై ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏలూరు 4వ డివిజన్లో ఎమ్మెల్యే చంటి సుడిగాలి పర్యటన చేశారు. ఆ డివిజన్లో వర్షపు నీటితో నిండిపోయిన రోడ్లపై స్వయంగా నడుచుకుంటూ వెళ్ళిన ఎమ్మెల్యే చంటి, స్థానిక ప్రజలనడిగి సమస్యలను తెలుసుకున్నారు. నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే నగరంలోని రహదారులు గుంతలమయంగా తయారయ్యాయని, నీరు నిలిచిపోయి అనేక వ్యాధులకు కారణమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం ముగిసిన వెంటనే రోడ్ల మరమత్తుల పనులకు శ్రీకారం చుడతామన్నారు. ఈలోగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా కచ్చా డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణం చేపట్టాలని ఆదేశించామన్నారు. నగర ప్రజల శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ముఖ్యోద్దేశ్యమని ఎమ్మెల్యే చంటి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్వో డాక్టర్ మాలతీ, మాజీ డిప్యూటి మేయర్ చోడే వెంకటరత్నం, కో – ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, టిడిపి నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, అమరావతి అశోక్, చోడే బాలు, పలువురు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.