సమాజ హితులు…జర్నలిస్టులు
1 min readవైద్యులు…పోలీసులతో సమానంగా పని చేసేది వారే…
- ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. శంకర్ శర్మ
- జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సీనియర్ వైద్యులు
కర్నూలు, పల్లెవెలుగు: వైద్యులు…పోలీసులతో సమానంగా.. నిరంతరం సమాజానికి సేవలు చేసే జర్నలిస్టులను ప్రతిఒక్కరూ గౌరవించాలని సూచించారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. శంకర్ శర్మ. ఆదివారం గురు పౌర్ణమి పండుగను పురస్కరించుకొని జర్నలిస్టులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ పగలనకా, రాత్రనకా ప్రజాసేవ కోసం నిరంతరం కష్టపడుతూ సమాజంలో ఉన్న జర్నలిస్టులకు ఉడుతా భక్తిగా నిత్యవసర సరుకులు పంపిణీ చేశానన్నారు. చాలామంది జర్నలిస్టులు ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగుల కోసం ఎక్కడికి వెళ్లకుండా సమాజానికి అంతో ఇంతో సేవ చేయాలని తలంపుతో జీత భత్యాలు లేకుండా సేవ చేస్తున్నటువంటి జర్నలిస్టులను ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలని అన్నారు. జర్నలిస్టులకు న్యాయబద్ధంగా రావలసిన అక్రిడిటేషన్ కార్డులు, ఆరోగ్య భీమా పథకాలు, జర్నలిస్టులకు వారి కుటుంబానికి విద్య, వైద్య సౌకర్యాలు ఈ ప్రభుత్వాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమాజంలో పోలీసులు, డాక్టర్లతో సమానంగా జర్నలిస్టులు నిరంతరం 365 రోజులు కష్టపడి పనిచేస్తుంటారన్నారు . ప్రతి ఒక్కరూ జర్నలిస్టులను గౌరవించాలని , ఆదరించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.