అసైన్డ్భూమి.. పట్టాగా మార్చి..!
1 min readవైసీపీ నేతల అండ… రెవెన్యూ అధికారుల కక్కుర్తి…
- సర్వే నంబరు 608/హెచ్ ను… 777/1 గా మార్చి…
- రూ. వంద కోట్లు విలువ చేసే పేదల భూమిని… ‘డీఆర్సీ’ విక్రయం
- భూ కబ్జాకు కేరాఫ్… డీఆర్సీ బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్
- అక్రమ లే అవుట్లతో కోట్లు కొల్లగొట్టిన ‘ శ్రీహరి ఆక్సిజన్ సిటీ ’
- విచారణ జరిపితే… వాస్తవాలు వెలుగులోకి వస్తాయి..
- బీజేపీ సీనియర్ నాయకుడు బై రెడ్డి రాజశేఖర్ రెడ్డి
కర్నూలు, పల్లెవెలుగు:వైసీపీ నాయకుల అండ దండలు… రెవెన్యూ, రిజిస్ర్టార్ అధికారుల కక్కుర్తి కారణంగా నగరంలోని డీఆర్సీ బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ యాజమాన్యం ప్రభుత్వ భూమిని సులువుగా కొట్టేసి… కోట్లు కొల్లగొట్టారని తీవ్రంగా ఆరోపించారు బీజేపీ సీనియర్ నాయకులు బై రెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఏకంగా సర్వే నెంబర్లు మార్చి… విల్లాలుగా అమ్మేసి… వంద కోట్లకు పైగా సొమ్ము చేసుకున్న డీఆర్సీ యాజమాన్యం ..మరో వంద కోట్లు కొల్లగొట్టేందుకు … ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బైరెడ్డి కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బై రెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. అసైన్డ్ భూమి సర్వే నెంబరు 608/ హెచ్ ను అప్పటి సర్వేయర్ , తహసీల్దార్ కు లంఛాలు ఇచ్చి.. ఏకంగా సర్వే నెంబరును మార్చారు. 608 /హెచ్ ను సర్వే నెంబరు ( కొత్త నెంబరు) 777/1 సిగా రికార్డులలో మార్చి… పెద్ద పెద్ద భవనాలు నిర్మించి.. వంద కోట్లకు పైగా సొమ్ము చేసుకున్నాడని ఆయన వెల్లడించారు.
రికార్డులు మార్చి… విల్లాలుగా అమ్మేసి…
వైసీపీ ప్రభుత్వ హయాంలో డీఆర్సీ బిల్డింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ యాజమాన్యం భూ కబ్జాలకు కేరాఫ్ గా మారిందని ఘాటుగా విమర్శించారు బై రెడ్డి రాజశేఖర్ రెడ్డి. 2020లో కర్నూలు రూరల్ తహసీల్దార్ , సర్వేయర్ డబ్బులకు కక్కుర్తి పడి… రుద్రవరం గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబరు 608/ హెచ్ ను సర్వే నెంబరు (కొత్తది) 777/1, 777/1సి, 1బి అడంగల్ ఆర్ ఓఆర్ లో పట్టా భూమిగా మార్చారు. ఇదే సర్వే నెంబరులో ఎకరాలు 360.51 సెంట్లకు పైగా ప్రభుత్వ భూమి గా చాలా మంది రైతులకు అమ్ముకోడానికి వీలులేకుండా నిషేధిత జాబితాలో ఉంచారు. కానీ సదరు తహసీల్దారు, సర్వేయర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారి డీఆర్సీ యాజమాన్యంతో భారీ మొత్తంలో లంఛాలు తీసుకొని… పట్టా భూమిగా మార్చి.. రిజిస్టర్లు చేయించారు. ఇందులో అప్పటి సబ్ రిజిస్టరు కూడా ఆమ్యామ్యాలు తీసుకుని.. చేసి ఉంటాడని ఆయన ఆరోపించారు.
ప్రజలను..ప్రభుత్వాన్ని మోసం చేసిన ‘డీఆర్సీ’
ప్రభుత్వ అసైన్డ్ భూమిని… పట్టాభూమిగా మార్చి… అటు ప్రభుత్వాన్ని… ఇటు బిల్డింగ్ కొనుగోలు దారులను దారుణంగా మోసం చేసిన ‘డీఆర్ సీ ’ యాజమాన్యంపై సీబీఐ విచారణ జరపాలని బీజేపీ సీనియర్ నాయకుడు బై రెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. రుద్రవరం గ్రామపంచాయతీ పరిధిలోని సర్వేనెంబరు 608/ హెచ్‌ను పేదల నుంచి కొనుగోలు చేసి… సర్వే నెంబరు 777/1, 777/1సీ,1బి గా మార్చేశారని, ఆ తరువాత గ్రామపంచాయతీ నుంచి అప్రూవల్ తీసుకొని ..భవనాలు నిర్మించి విక్రయించారని స్పష్టంగా వివరించారు. ప్రభుత్వం దృష్టిలో పేదల భూమి (అసైన్డ్ భూమి)గా ఉంటుందని, కానీ సర్వే నెంబరు మార్చి పట్టాభూమిగా మార్చి.. విల్లాలు కట్టి.. రిజిస్టర్లు చేశారని వెల్లడించారు. అటు కొనుగోలుదారులను… ఇటు ప్రభుత్వాన్ని నిలువునా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో వంద కోట్లకు… ప్లాన్…
పాత సర్వే నెంబరు 608/హెచ్ పైభాగంలో మరో కొత్త సర్వే నెంబరు 778/1, 778/3,778/4 లో మొత్తం ఎకరములు 3.69 సెంట్లు రివైజ్ కాబడిన సర్వే నెంబర్లతో అదే తప్పుడు మార్గాన .. అక్రమ లే అవుట్ వేసి మరో వంద కోట్ల రూపాయలు అక్రమార్జనకు డీఆర్సీ యజమని కుట్ర పన్నాడని బై రెడ్డి రాజశేఖర్ రెడ్డి ధ్వజమెత్తాడు. అనుమతి లేకపోయినా బిల్డింగ్ లు నిర్మించి… విక్రయిస్తున్నాడని, వీటిని కొనుగోలు చేసిన ప్రజలు మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్లు మార్చి విక్రయించిన డీఆర్సీ యజమానిపై, ఇందుకు సహకరించిన తహసీల్దారు , సర్వేయర్ పై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే … వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడును త్వరలో కలుస్తానని ఈ సందర్భంగా బై రెడ్డి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. కొనుగోలుదారులను.. ప్రభుత్వాన్ని మోసం చేసిన డీఆర్ సీ యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, శ్రీహరి ఆక్సిజన్ సిటీలో భవనాలు కొనుగోలు చేసిన వారికి , పేదలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బై రెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.