రైతాంగాన్ని నిరాశపర్చిన కేంద్ర బడ్జెట్
1 min readరుణమాఫీ, మద్దతు ధరల గ్యారెంటీ చట్టం ప్రతిపాదనలేదు
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ విమర్శ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ఏలూరు అన్నే భవనంలో కేంద్ర బడ్జెట్ పై ఆయన మాట్లాడారు.రూ.48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు కేవలం లక్ష 52వేల కోట్లు మాత్రమే కేటాయింపు చేయడం అన్యాయమన్నారు. దేశంలో 58 శాతం మంది ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయ రంగానికి కనీసంగా 10% నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. దేశంలో రైతుల కోరుకున్న విధంగా రుణమాఫీ, మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం వంటి అంశాలు ఈ కేంద్ర బడ్జెట్ లో ఎటువంటి ప్రతిపాదనలు లేకపోవడం దుర్మార్గమని విమర్శించారు. విదేశీ కార్పొరేట్ కంపెనీలకు పన్ను రాయితీలు ప్రకటించిన కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం రైతుల వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ రద్దు పై ఎటువంటి ప్రకటన చేయలేదన్నారు. ఒకవైపు వ్యవసాయ రంగానికి, రైతులకు పెద్దపీట వేస్తున్నట్లుప్రచారం చేసుకుంటూ ఆచరణలో వ్యవసాయ కార్పొరేటీకరణ చర్యలు చేపడుతోందన్నారు. ఎరువుల సబ్సిడీ తగ్గించి వేశారన్నారు. నూనె గింజలు, పప్పు ధాన్యాలు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధిస్తామని చెబుతూనే విదేశీ దిగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేసిందన్నారు. దేశంలో ఆయిల్ పామ్, వేరుశనగ, కొబ్బరి, ప్రొద్దుతిరుగుడు తదితర పంటలు పండించే రైతులకు కనీస ధరలు రాక నష్టపోతున్నారని చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకత పెంచుతామని మాటలు చెప్పడం ఆచరణ శూన్యమన్నారు. భూసంస్కరణలు చేపడతామని చెబుతూ అన్ని భూములకు ఆధార్, భూ మ్యాప్ లు డిజిటలైజేషన్, భూ సర్వేల పేరుతో రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు నీతి అయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి చట్టాలు అమలకు ప్రతిపాదనలు చేయడం తగదన్నారు.ఇది కార్పొరేట్ కంపెనీలు అనుకూల బడ్జెట్ అని చెప్పారు. కౌలు రైతులను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న రైతాంగాన్ని ప్రత్యేకంగా ఆదుకునేందుకు నిధులు కేటాయింపు లేవన్నారు. కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కనీసంగా 10 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని, రైతుల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక కేంద్ర బడ్జెట్ పై రైతాంగం నిరసన వ్యక్తం చేయాలని కోరారు.